TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్వర్ణ నారావారి పల్లెకు స్కోచ్ గోల్డెన్ అవార్డు

Published on: Sun Sep 21, 2025 3:04PM

 

స్వర్ణ నారావారిపల్లి గ్రామం ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డును గెలుచుకుంది. ప్రతి ఇంటికీ సౌర రూఫ్‌టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేయించుకున్న దేశంలోని తొలి గ్రామంగా ఈ గౌరవం దక్కింది. కేవలం 45 రోజుల్లోనే 1,600 ఇళ్లపై సోలార్ ప్యానెల్‌లను అమర్చి, గ్రామమంతా విద్యుత్ వెలుగులు నింపారు.

కర్బన ఉద్గారాలను తగ్గించి, హరిత స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో, ప్రతి ఇంటికి ఉచితంగా సౌర ప్యానెల్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 3,396 కిలోవాట్ల సామర్థ్యంతో, ఏటా సుమారు 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవనుంది. దీని విలువ దాదాపు ₹3.39 కోట్ల వరకు ఉంటుంది.

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును విజయవంతం చేశాయి. గ్రీన్ ఎనర్జీ వినియోగంలో సంపూర్ణంగా ముందడుగు వేసిన గ్రామంగా, స్కోచ్ సంస్థ ఈ గోల్డెన్ అవార్డును ప్రకటించింది.

తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు ఢిల్లీలో ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు “ఎక్స్” వేదికగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి తోడ్పడిన ప్రజలు, అధికారులు అందరికీ అభినందనలు తెలియజేశారు.