మీ బాబు మా బాబు మీద....జగన్ కి లోకేష్ కౌంటర్
Published on: Thu Jun 27, 2019 3:58PM

నవ్యాంధ్ర రెండో సీఎంగా ఎన్నికయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పాలనలో తన మార్క్ చూపడానికి తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన రోజూ ఏదో ఒక సమీక్ష చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపైనా ఫోకస్ పెట్టిన ఆయన అప్పటి అవకతవకల్ని బయటపెట్టేందుకు ఏకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే దాదాపు 30 అంశాలపై విచారణ జరిపి కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అయితే తాజాగా ఈ వ్యవహారం మీద మాజీ మంత్రి నారా లోకేష్స్పందించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన అయన ‘వైఎస్ జగన్ గారూ.. అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏమీ బాగోలేదు సార్’అంటూ సెటైర్ వేశారు. అంతేకాక ‘మీ బాబు, మా బాబుపై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రవేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరమూ కాదు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది. పోలవరంపై టీడీపీ హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల...కల గానే మిగిలిపోతుంది’అని ఆయన ఘాటుగా ట్వీట్లు చేశారు.


