లోకేష్ కి బిగుస్తున్న ఉచ్చు....అరెస్ట్ చేస్తారా ?

 

ఐటీ శాఖలో రూ. 25 వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ గత ఏడాది సెప్టెంబర్ లో అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు మీదా ఐటీ శాఖామంత్రిగా ఉన్న ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌ మీద హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌ కుమార్‌ అప్పట్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గత టర్మ్ లో ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్‌ గా ఉన్న వేమూరి రవికుమార్‌, మాజీ ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాధరెడ్డిలకి కూడా ఈ అవినీతి కుంభకోణంలో హస్తం ఉందని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 

దొంగ ఎంవోయూలతో వేల ఎకరాల భూమిని ధారదత్తం చేశారని, దీని ద్వారా లబ్ది పొంది భారీ ఎత్తున ఆస్తులను పెంచుకున్నారని అప్పట్లో పిటిషనర్ పేర్కొన్నారు. కనీస అర్హత కూడా లేని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నాలుగేళ్లుగా కార్యకలపాలు చేపట్టలేదని పిటిషన్‌లో వెల్లడించారు. ఐటీ కంపెనీల పేరుతో జరిగిన క్విడ్‌ ప్రోకోపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే ఈ విషయం మీద పూర్తి వివరాలతో అంటే ఆరోపణలు చేస్తున్న కంపెనీల పూర్తి వివరాలతో మళ్ళీ రమ్మని కోర్టు పేర్కొనడంతో అసలు ఆర్టీఏ ద్వారా సమాచారం కోరినా తనకు ఆ వివరాలు ఇవ్వడం లేదని పిటిషనర్‌ హైకోర్టుకు విన్నవించుకుని కేసు ఉపసంహరించుకున్నారు. 

ఈ విషయం మామూలు వార్తలాగా వచ్చి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతామారిపోయి జగన్ సీఎం కావడంతో లోకేష్ అవినీతిని జగన్ సర్కార్ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ మధ్యనే పార్టీ మారి కాషాయం కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ హైలైట్ చేశారు. లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందనే విషయం మీద విచారణ చేపట్టమని కోరేందుకు రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తానని ఆయన చెప్పారు. 

కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. లోకేష్‌ తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పిన ఆయన లోకేష్‌ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిందని అన్నారు. ఇక త్వరలో పార్టీ ఖాళీ కాబోతుందని అది కూడా లోకేష్ కారణంగానే జోస్యం చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే గత ప్రభుత్వ అవినీతి కోసం భూతద్దం వేసుకుని మరీ వెతుకున్న జగన్ కి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. 

వెదకబోయే తీగ కాలికి తగిలినట్టు జగన్ కి లోకేష్ అవినీతి కేసు దొరికిందని అంటున్నారు విశ్లేషకులు. నిజంగా అవినీతి జరిగిందా ? లేదా అనేది పక్కన పెడితే ఈ విషయం మళ్ళీ హైలైట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ యంత్రాంగం, బీజేపీ కలిస్తే లోకేష్ ని అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తమకి ఎదురుతిరిగిన వారికి షా-మోడీలు ఎంత వరకూ చుక్కలు చూపిస్తారో లాలూ వంటి వారి విషయంలో చూశాం కదా.