మీకు ఓటేసిన వారినే కాటేస్తున్నారు.. సీఎం జగన్ పై లోకేష్ ఫైర్
Published on: Wed Aug 26, 2020 12:00PM
గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో "వైసిపికి ఓటేసిన వారినే సీఎం జగన్ కాటేస్తున్నారంటూ" టీడీపీ నేత నారా లోకేష్ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. "మద్యపాన నిషేధం పేరుతో వైసీపీ ప్రభుత్వం సామాన్యులను దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టిన దళిత యువకుడు ఓం ప్రతాప్‌ను బలితీసుకున్నారని" అయన ఆరోపించారు.
తాజాగా ఈ మేరకు ఆ యువకుడి ఫోటోలను కూడా లోకేష్ తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. ఒక పక్క " చంపేస్తామంటూ వైసీపీ నేతల బెదిరింపులు.. మరో పక్క పోలీసుల వేధింపుల కారణంగానే" చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని కందూరు గ్రామానికి చెందిన ఓం ప్రతాప్ చనిపోయాడని అయన ఆరోపించారు. దళితుడైన ఓం ప్రతాప్ మృతిపై విచారణ జరిపించి.. ఈ ఘటన వెనుక ప్రమేయమున్న వైసీపీ ముఖ్య నేతలను కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు దళితులకు లేదా.. అని అయన జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. అంతేకాకుండా దళితులపై జగన్ ప్రభుత్వ దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.


