2007లోనే వైఎస్ఆర్ కోరారు.. జగన్ క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా?

 

గత ఐదేళ్ళలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సాధించిన ఘనతల్లో ఒకటిగా అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ గురించి ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. అయితే కియా మోటార్స్ ఏర్పాటు విషయంలో అసలు బాబు గొప్ప ఏంలేదంటూ వైసీపీ నేత, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు 13 జూన్,2019న కియా మోటార్స్ కార్పోరేషన్ సీఈవో ఏపీ సీఎం వైఎస్ జగన్ కి రాసిన లేఖను అసెంబ్లీలో బుగ్గన చదివి వినిపించారు. జగన్ సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపిన కియా సీఈవో.. గతంలో రాజశేఖర్ రెడ్డితో తన పరిచయాన్ని ఆ లేఖలో గుర్తుచేసుకున్నారు. 2007లో తాను హైదరాబాద్ హ్యుందయ్ ఫ్యాక్టరీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని కలిసినట్టు అందులో తెలిపారు. ఆ సందర్భంగా రాయలసీమలో హ్యుందయ్ ఫ్యాక్టరీ పెట్టాలని వైఎస్ కోరారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా అక్కడ ఫ్యాక్టరీ పెడుతామని మాటిచ్చారని.. రాజశేఖర్ రెడ్డికి ఆనాడు ఇచ్చిన వాగ్దానం మేరకు కియా మోటార్స్ తమ సంస్థను అనంతపురంలో నెలకొల్పిందని బుగ్గన తెలిపారు. అంతే తప్ప.. చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లడం వల్ల ఇది ఏర్పాటు కాలేదన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉందని.. అందుకే సభలో లేఖను చదివి వినిపించానని బుగ్గన పేర్కొన్నారు.

కాగా బుగ్గన వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సెటైరికల్ ట్వీట్ చేశారు. "కియాను ఏపీకి రమ్మని 2007లోనే వైఎస్ఆర్ కోరారంట. వాళ్ళు కూడా వస్తామని మాటిచ్చారంట. మరెందుకు రాలేదో! వోక్స్ వ్యాగన్ కుంభకోణం, వైఎస్ జగన్ గారి క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా? ఇంకా నయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు." అని లోకేష్ ఎద్దేవా చేశారు.

లోకేష్ ట్వీట్ తో సోషల్ మీడియాలో కియా మోటార్స్ పై విపరీతమైన చర్చ నడుస్తోంది. కొందరు లోకేష్ కి వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తుంటే, కొందరు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు. "భలే జోకేశావ్.. మీడియా ముందు మాట్లాడలేక ట్విట్టర్ లో వాగుతున్నావా?" అంటూ కొందరు.. "కియా వారికి కంప్లైంట్ ఇవ్వు" అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.

మరికొందరేమో గతంలో జగన్ మాటలను గుర్తు చేస్తూ లోకేష్ కి మద్దతుగా ట్వీట్స్ చేసున్నారు. గతంలో జగన్.. కియా మోటార్స్ ఘనత మోడీది అని ఎన్నికల సమయంలో పెనుకొండలో అన్నారు. ఇప్పుడేమో ఆయన కేబినెట్ మంత్రి కియా మోటార్స్ తెచ్చింది వైఎస్ఆర్ అంటున్నారు. మరి జగన్ అబద్దం చెప్పారా? లేక మంత్రి అబద్దం చెప్తున్నారా అంటూ ప్రశ్నిస్తూ.. లోకేష్ కి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. అసలు ఈ కియా మోటార్స్ ఘనత ఎవరిదో తెలీదు కానీ.. ఎవరికివారు క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.