మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది బలయ్యారు

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్నఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "200 రోజులుగా రైతులను, రైతు కూలీలను, మహిళలను ఏడిపించి, మీరు సాధించింది ఏంటి వైఎస్ జగన్ గారు?" అని లోకేష్ ప్రశ్నించారు.

"వైఎస్ జగన్ గారూ! మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేసి మీ అవినీతి భాగస్వామికొకటి, మీ తప్పుడు పత్రిక నిర్వాహకునికి ఒకటి, మీ మామకొకటి ఇచ్చేసుకోడానికా... 29,881 మంది రైతులు రాజధాని అమరావతి కోసం త్యాగం చేసింది?" అని లోకేష్ మండిపడ్డారు.

"మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు బలయ్యారు. వారి త్యాగాలను పణంగా పెట్టే మీ ఆటలు సాగనివ్వం. 200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా?" అని లోకేష్ ధ్వజమెత్తారు.

"రాష్ట్రప్రజలరా! ఇది రాజధాని రైతు సమస్య మాత్రమే కాదు. విధ్వంసకర పాలనకు, ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. అందుకే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకంకండి. 'ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని' అంటూ అమరావతి కోసం ఉద్యమించండి. జై అమరావతి!" అంటూ లోకేష్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.