విజయసాయి రెడ్డి వీడియో లీక్.. గుట్టు రట్టు చేసిన లోకేష్!!

 

గ్రామ వాలంటీర్ల నియామకం ఓ కుంభకోణం అని, వాలంటీర్ల నియామకం పేరుతో రూ.12 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. గ్రామ వాలంటీర్ల నియామకం గురించి టీడీపీ మొదట్నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా ఎంపిక చేస్తున్నారని, అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ మూలంగా రేషన్ డీలర్లు, మీ సేవా సిబ్బంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని టీడీపీ ఆరోపిస్తుంది. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థను వైసీపీ కార్యకర్తలకు దోచి పెట్టేందుకే తీసుకొచ్చారని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. తాజాగా నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా అలాంటి వ్యాఖ్యలే చేసారు. 'సీక్రెట్ గా చిత్రీకరించిన వైసీపీ భాగోతం' అంటూ వైసీపీ నేత విజయ సాయి రెడ్డి వైసీపీ కార్యకర్తలతో మాట్లాడిన వీడియోను లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఆ వీడియోలో విజయ సాయి రెడ్డి.. గ్రామ వాలంటీర్ వ్యవస్థను, సోషల్ మీడియాలో వైసీపీ తరపున కష్టపడిన వారికోసం తీసుకొచ్చాము అని అర్థమొచ్చేలా వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది. అధికారికంగా ఇలాంటివి చెప్పలేమని, సోషల్ మీడియాలో పనిచేసిన వారి గురించి జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విజయ సాయి ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియోను లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేసి.. వైసీపీ సర్కార్ మీద విమర్శలు గుప్పించారు.

"వైఎస్ జగన్ గారు స్కామ్ స్టార్ అని మరోసారి ఆధారాలతో రుజువైంది. గ్రామ వాలంటీర్ల స్కామ్ తో 12వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకం అని జగన్ గారు ఆస్కార్ రేంజిలో నటిస్తుంటే, కడుపులో దాచుకోలేక వైసీపీ స్కామ్ ని దొంగలెక్కల వీరుడు బయటకి కక్కేశారు." అని లోకేష్ విమర్శించారు.

"వాలంటీర్ల నియామకంలో కులం, మతం చూడలేదు వైసీపీ కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూసాం అని స్వయంగా ప్రకటిస్తున్నారు. నాలుగు లక్షల మంది వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి వారి పొట్ట కొట్టే భారీ కుట్రే వైసీపీ వాలంటీర్ల స్కీం." అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.