దొంగబ్బాయ్ తొలి సంతకమే దొంగదట : లోకేష్

 

ఈ మధ్య కాలంలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న లోకేష్ ఈరోజు కూడా ఏపీ సీఎం జగన్ మీద సెటైర్ లు వేశారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాల విషయం మీద ఈరోజు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ఆశా వర్కర్ల జీతాలు, రైతుల ఆత్మహత్యల అంశం మీద జగన్‌ను టార్గెట్ చేసిన లోకేష్ ఈ రెండు విషయాలను ఉద్దేశిస్తూ టార్గెట్ చేశారు.ఆయన చేసిన ట్వీట్ యధాతధంగా జగన్ మాయా ప్రభుత్వం...రైతుల పేరుతో జగన్ గారు వికృత రాజకీయం మొదలుపెట్టి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. 

బడ్జెట్ కాగితాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తూ, అందులో 391 మందివి మాత్రమే రైతుల ఆత్మహత్యలని తేల్చారని, కానీ అదే అసెంబ్లీ సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా 1160 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతూ, అందులో 454 మందివి రైతుల ఆత్మహత్యలని చెప్పారని అన్నారు. టిడిపి హయాంలో రైతుల ఆత్మహత్యలు అంటూ దొంగలెక్కలు మాని మీ నాన్నగారి హయాంలో చనిపోయిన 15 వేలమంది రైతులకు ఓదార్పునివ్వాలని ప్రార్థన అంటూ ట్వీట్ చేశారు లోకేష్. 

ఇక నిన్న ఆశా వర్కర్ ల విషయంలో కూడా లోకేష్ జగన్ సర్కార్ ని టార్గెట్ చేశారు. దొంగబ్బాయ్ తొలి సంతకమే దొంగ సంతకం అని తేలిపోయింది. రూ.10 వేలు జీతం పెంచేస్తున్నాం అని ఆశా వర్కర్లని ఆశపెట్టి దగా చేసారు. తూచ్! మేము ఆ హామీ ఇవ్వలేదు పెంచేది రూ.1400లే అని మంత్రి అసెంబ్లీ సాక్షిగా తేల్చారని లోకేష్ ట్వీట్ చేశారు. ఇలా ఒక్కో రత్నం రాలిపోతే, మీ ఇంటి దగ్గర 144 సెక్షన్ కొనసాగించాల్సి వస్తుంది. ఆశావర్కర్లకి ఇచ్చిన హామీ మేరకు జీతం పెంచే వరకూ మేము ఉద్యమిస్తామని లోకేష్ హెచ్చరించారు.