TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ్యాన్ కు ఓటేసిన వాళ్లే ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారు! 

Published on: Mon Sep 13, 2021 11:55AM

జాబ్ రావాలంటే అన్న రావాలి.. ఇది వైసీపీ ఎన్నికల నినాదం. అది నమ్మి యువకులు వైసీపీకి ఓటేశారు. అన్న అధికారంలోకి వచ్చాడు. కాని రెండున్నర ఏండ్లు అవుతున్నా జాబులు మాత్రం రావడం లేదు. కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు జాడే లేకపోగా.. జగనన్న సర్కార్ విధానాలతో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు పోతున్నాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులతో  చాలా పారిశ్రామిక సంస్థలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి. కొత్త కంపెనీలు ఏపీకి  రావడం లేదు. దీంతో ఉపాధి లేక లక్షలాది మంది యువతి యువకులు రోడ్డున పడుతున్నారు. కర్నూల్ జిల్లాలో ఉద్యోగం రావడం లేదనే మనస్థాపంతో  ఓ యువకుడు సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. 

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో వీరాంజనేయులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎర్రకోట గ్రామానికి చెందిన ఉప్పర ఈశ్వరమ్మ, వీరభద్ర కుమారుడైన వీరాంజనేయులు చదువులో చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవాడు. ఉపాధ్యాయులంతా సరస్వతీ పుత్రుడని పిలిచేవారు, పదో తరగతిలో మంచి మార్కులతో ట్రిపుల్‌ ఐటీ సీటు సాధించాడు. ఆరేళ్ల ట్రిపుల్‌ ఐటీలోను మంచి మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ గ్రూపు-2కు సన్నద్ధమయ్యాడు. ఉద్యోగం రాలేదు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురుచూశాడు. నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మనోవేదనకు గురయ్యేవాడు. ఎంత చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నిరాశ చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని తనువు చాలించాడు. కుటుంబ సభ్యులు చూసేలోగా ప్రాణాలు విడిచాడు. 

వీరాంజనేయులు చనిపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదువుల్లో టాప్ గా నిలిచిన వీరాంజనేయులు చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే వీరాంజనేయులు చనిపోయాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద్యోగాలు రాక యువ‌కులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. 'వైఎస్ జ‌గ‌న్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయింది. ఫ్యాన్ కి ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటోంది' అని లోకేశ్ విమర్శించారు. 

'కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసింది. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరం' అని లోకేశ్ ట్వీట్ చేశారు.'వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు.. పోరాడి  ఉద్యోగాలు సాదిద్దాం' అని నారా లోకేశ్ అన్నారు.