పొలిటికల్ స్టార్ డమ్ కోసం 'నారా లోకేష్' ఆరాటం..!!
Published on: Wed Jan 13, 2016 1:55PM
.jpg)
పొలిటికల్ స్టార్ డమ్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరాటపడుతున్నాడట. టిడిపి పార్టీలో తెరవెనుక ఎన్నో పనులు చక్కబెడుతున్న..తనకు అంతగా మీడియాలో గానీ, ప్రజల్లో గానీ పబ్లిసిటీ రావడం లేదని ఆవేదన చెందుతున్నాడట.
ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా... రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తూ..టీఆర్‌ఎస్‌లో కీలకనేతగా ఎదిగారు. పత్రిక, ప్రసార సాధనాలు కూడా ఆయనకు ప్రాధాన్యతనిస్తున్నాయి.దీంతో జాతీయ స్థాయిలో పేరు, రాష్ట్రంలో తగిన గుర్తింపు తెచ్చుకునేందుకు ఎక్కడో ఓ చోట మంత్రిగా చేరటమే మంచిదని లోకేష్ భావిస్తున్నాట్టు రాజకీయ వర్గాల టాక్.
ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు. ఎమ్మెల్యేగా వుండాలంటే..ఎవరితోనైనా రాజీనామా చేయించాలి. అందుకని లోకేష్ కన్ను రాజ్య సభపై పడినట్టు రాజకీయ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి పదవీ గండం పొంచి వుందంటూ చాలాకాలంగా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. త్వరలో రాజ్యసభ పదవీ కాలం ముగియనున్నందున పార్టీకి సంబంధించిన ముఖ్యమైన పదవి ఏదో ఒకటి ఆయనకి ఇచ్చి.. నారా లోకేష్‌ని కేంద్రమంత్రిగా చేయాలని చంద్రబాబు కూడా భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు గుప్పుమంటున్నాయి.
మరోపక్క సంక్రాంతి తర్వాత ఏ నిమిషంలో అయినా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ వుంటుందన్న సంకేతాలు జాతీయ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఏపీకి సుజనా చౌదరి స్థానంలో మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్న చంద్రబాబు, తెలంగాణలో అదనంగా ఇంకో కేంద్ర మంత్రి పదవీ.. అదీ తన కొడుక్కి ఆశిస్తున్నారంటూ మరో గాసిప్ ప్రచారం చేస్తోంది.
మూడు కేంద్ర మంత్రి పదవులు కావాలని గతంలోనే బాబు బీజేపీ అధిష్టానానికి అప్లికేషన్ పెట్టుకున్నారట. అలాగే తెలంగాణ కోటాలోనే నారా లోకేష్‌కి కేంద్ర మంత్రి పదవి వస్తే పార్టీకి లాభమని టిడిపి తెలంగాణ నేతలు భావిస్తున్నారట. మొత్తం మీద చిన్నబాబు కోరిక, కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ ఊహాగానాలు..టిడిపిలో ఎలాంటి మార్పులు తెస్తాయోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


