సినీ పరిశ్రమలోకి నారా లోకేష్ ఎంట్రీ.. మొదటి సినిమా ఎవరితో?
Published on: Sat Jun 1, 2019 4:36PM

మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి, రాజకీయ వారసులు సినిమాల్లోకి వెళ్లడం తరతరాలుగా జరుగుతూనే ఉంది. అయితే తాజాగా మరో రాజకీయ వారసుడు సినిమాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్. లోకేష్ గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన లోకేష్ కూడా ఓడిపోయారు. రాజకీయాల్లో అడుగులు తడబడడంతో.. లోకేష్ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నారట. అలా అని సినిమాల్లో నటించే సాహసం చేయడం లేదు. కేవలం సినిమా నిర్మాణం వైపుగా ఆయన ఆలోచనలు చేస్తున్నారట. సినీ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి వరుస సినిమాలు తీయాలని లోకేష్ భావిస్తున్నట్లు సమాచారం. మరి లోకేష్ నిజంగానే సినీ నిర్మాతగా మారితే ఎవరితో సినిమా తీస్తారో?. నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు ఉన్నారు. ఇటు నారా కుటుంబం నుంచి రోహిత్ ఉన్నారు. మరి లోకేష్ తమ కుటుంబ బంధువులతోనే సినిమాలు చేస్తారో లేక భిన్నంగా వేరే ఎవరితోనైనా చేస్తారో చూడాలి.


