త్వరలో నారా లోకేష్ సైకిల్ యాత్ర

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత సం. “వస్తున్నామీ కోసం”అంటూ పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తించారు. ఇప్పుడు ఆయన తనయుడు నారా లోకేష్ అదే స్పూర్తితో త్వరలో సైకిల్ యాత్ర మొదలుపెట్టి రాష్ట్రమంతటా పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు. తెదేపా ప్రస్తుతం ఆయన యాత్రకి రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది. త్వరలోనే ఆయన యాత్ర మొదలయ్యే తేదీ ప్రకటించవచ్చును. ఆయన తిరుపతి నుండి తన యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది.

 

మరొక రెండు మూడు నెలలో ఎన్నికలు వస్తున్నందున ఆంద్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలలో ప్రజలను, పార్టీ శ్రేణులను కలిసి గత పది సం.ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏవిధంగా అధోగతికి దిగజారిపోయిందో వివరిస్తూ, తేదేపాకు ఓటేయమని ప్రజలను కోరుతారు. లోకేష్ తన యాత్రలో ప్రధానంగా యువతను కలిసి మాట్లాడుతూ పార్టీకి వారి సహకారం కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయబోవడం లేదని ముందే ప్రకటించారు. గనుక ఆయన పార్టీని బలోపేతం చేయడంపైనే శ్రద్ధ వహిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన తన సైకిల్ యాత్రలో పార్టీ కార్యకర్తలను, స్థానిక నేతలను కూడా కలుస్తూ పార్టీ పరిస్థితి గురించి చర్చించి, వారి నుండి సలహాలను, సూచనలను తీసుకొంటూ, వారికి తగిన విధంగా మార్గదర్శకత్వం చేసే అవకాశం ఉంది. ఈ నెల 24 లేదా 26 తేదీలలో ఎన్నికల కమీషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవచ్చునని తాజా సమాచారం. అందువల్ల నారా లోకేష్ ఇప్పుడు మొదలుపెడుతున్న సైకిల్ యాత్ర ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కొనసాగించవచ్చును.