మళ్ళీ ట్వీటిన లోకేష్

 

తెలుగు దేశం పార్టీ యువనాయకుడిగా గుర్తింపు పొందిన నారా లోకేష్, ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ ఆరంగ్రేటం చేయకపోయినా, పార్టీ వ్యవహారాలలో చురుకుగా ఉంటున్నాడని అందరికీ తెలిసిన విషయమే. తానూ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకపోయినా, అప్పుడప్పుడు ట్వీటర్ వంటి సామాజిక వెబ్ సైట్లలో చురుక్కుమననిపించే చిన్నచిన్న సందేశాలను పెడుతూ, తమ ప్రత్యర్ధి పార్టీలను డ్డీకొంటూ ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

 

మళ్ళీ చాలా రోజుల తరువాత మళ్ళీ మరోమారు వైయస్సార్ కాంగ్రే పార్టీని, దాని బాకాపత్రిక సాక్షిని గిల్లుతూ, నిన్న తన ట్వీటర్ పేజీలో ఒక చిన్న సందేశం పెట్టారు. సందేశం చిన్నదయినా సూటిగా తగల వలసిన చోటే తగిలేట్లు ఉంది. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే “మీ మీడియాను ఆయుధంగా చేసుకొని న్యాయ వ్యవస్థను బెదించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి, విమర్శించడాన్నిమొన్న సుప్రీంకోర్టు తప్పుపట్టింది గనుక, ఇక రేపు మీ పత్రికలో ప్రచురింపబోయే తరువాత ఆర్టికల్ సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని ఉండబోతోందా?” అని వ్రాసారు.

 

జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినపటి నుండీ వైయస్సార్ కాంగ్రే పార్టీ ప్రత్యక్షంగా కోర్టులను వేలెత్తి చూపించే దైర్యం చేయకపోయినా, రాజకీయ దురుద్దేశాలతో కాంగ్రెస్ పార్టీ సీబిఐని ఆయుధంగా చేసుకొని జగన్ మోహన్ రెడ్డికి బెయిలు రానివ్వకుండా చేస్తున్నదని పదేపదే అనడం ద్వారా, కోర్టులను పరోక్షంగా నిందిస్తున్నట్లు భావించిన సుప్రీంకోర్టు మొన్న జరిగిన విచారణ సమయంలో జగన్ తరపున వాదిస్తున్న లాయర్లకు చివాట్లు పెట్టడం జరిగింది. నారా లోకేష్ అదే విషయాన్నీ ప్రస్తావిస్తూ ట్వీటర్ లో సందేశం పెట్టారు.