TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆస్ట్రేలియా బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లతో మంత్రి లోకేష్ భేటీ

Published on: Mon Oct 20, 2025 3:45PM

 

ఏపీలో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హెచ్ఎస్ బీసీ బ్యాంక్ సీఈవో ఆంటోనీ షా నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... విజనరీ ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి రూ.10లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 

రాష్ట్రంలో 1,051 కి.మీ.ల సువిశాల తీరప్రాంతంతో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ తో ఎంవోయూ చేసుకున్నాక ఆ పరిశ్రమను మాదిగా భావించి అవసరమైన అన్ని అనుమతులు, ప్రోత్సహకాలు అందిస్తామని లోకేష్ తెలిపారు. ఆంధ్రపదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఏపీలో నెలకొన్న పరిశ్రమల అనుకూల వాతావరణం, అమలుచేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను తెలుసుకునేందుకు వచ్చే నెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. 

ఈ భేటీలో అమెజాన్ పబ్లిక్ పాలసీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆగ్నేయాసియా) డైరెక్టర్ మైఖేల్ కూలే, సిస్కో వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ ఎక్స్ పీరియన్స్ - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) జెట్టి మురళి, రిచర్డ్ వాట్సన్ (ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రధాన భాగస్వామి), గ్రెయిన్ కార్ప్ సీఈవో రాబర్ట్ స్పర్వే, హెచ్ సీఎల్ టెక్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గీతేష్ అగర్వాల్, జై పటేల్ (హెడ్, కెపీఎంజీ ఇండియా బిజినెస్ ప్రాక్టీస్), మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్ ) శ్రీమతి టాన్యా స్టోయానాఫ్, ది యూనివర్సిటీ ఆఫ్ మెల్ బోర్న్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ & గవర్నమెంట్ రిలేషన్స్ ) ముత్తుపాండ్యన్ అశోక్ కుమార్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ డిప్యూటీ డీన్ (రీసెర్చ్ & ఇన్నోవేషన్) ప్రొఫెసర్ మైఖేల్ బ్లూమెన్ స్టీ తదితరులు పాల్గొన్నారు.