చెస్‌లో దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు
Published on: Sun Sep 14, 2025 3:58PM

ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ అరుదైన ఘనత సాధించారు. వరల్డ్ స్థాయి అవార్డును అందుకున్నారు. ఫాస్టెస్ట్ చెక్‌మెట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను దేవాన్ష్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో ప్రముఖుల చేతుల మీదుగా దేవాన్ష్ అవార్డు స్వీకరించారు.
అవార్డ్ ప్రదానోత్సవానికి మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును దేవాన్ష్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇదో ప్రత్యేకమైన ఘనతని వ్యాఖ్యానించారు. ఒక తండ్రిగా పుత్రోత్సాహం పొందుతున్నానని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అటు దేవాన్ష్ అవార్డ్ సాధించడంపై టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్, ఆయన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.
గతేడాది డిసెంబర్ నెలలో దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల వయస్సులోనే ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నారు. వ్యూహాత్మకమైన ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్‌ను దేవాన్ష్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.


