నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

 

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి (69) మంగళవారం రాత్రి మృతి చెందారు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 09.30లకు ఆయన తుది శ్వాస విడిచారు. ఎస్పీవైరెడ్డి మూడు దఫాలుగా లోక్‌సభ సభ్యునిగా విశేష సేవలందించారు. నందిపైపుల అధినేతగా ఆయన ముద్ర వేసుకున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున నంద్యాల పార్లమెంటు స్థానానికి పోటీ పడ్డారు. ఎన్నికల ప్రచారంలో.. ఎండల తీవ్రతవల్ల వడదెబ్బకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. సుమారు 26 రోజులుగా చికిత్స అందిస్తున్నా ఫలితం లేకపోయింది. ఆయన మరణవార్తతో అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్పీవై రెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.