మంత్రంటే లెక్కలేదు..ముఖ్యమంత్రన్న గౌరవం లేదు

నోటికి..బుర్రకి ఏది తోస్తే అది మాట్లాడటం వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి మొదటి నుంచి అలవాటు..అవతల పక్క ఎంతటి వారైనా
ఉండని..నాకెందుకు నాలుగు మాటలు అన్నామా..? లేదా అన్నదే ఆమె పనిగా పెట్టుకున్నట్లున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పేరెత్తితే చాలు ఆమె అంతెత్తున లేస్తున్నారు. ఆలోచించి మాట్లాడుతున్నారో..అనాలని అంటున్నారో తెలీదు కానీ రోజా కామెంట్స్‌ పలు సందర్భాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

 

పాపం ఆ నోటి దురుసుతో టాక్‌ ఆఫ్ ది టౌన్ అవుతున్నా..కొన్నిసార్లు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. అసెంబ్లీ వేదికగా తోటి సభ్యులపై చేసిన కామెంట్స్ రోజాను ఏడాది పాటు చట్టసభకు దూరం చేసింది. ఇప్పటికీ ఆ వ్యవహారం హైకోర్టులో నడుస్తూనే ఉంది. నోరు అదుపులో పెట్టుకోవాలని సాక్షాత్తూ పార్టీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చినా..పార్టీకి ఏమాత్రం సంబంధం లేని బయటి వ్యక్తి ప్రశాంత్ కిశోర్‌తో చీవాట్లు తిన్నా ఆమె బుద్ది మారడం లేదు. అవసరం లేకపోతేనే టీడీపీని..ఆ పార్టీ నేతలపై చిర్రుబుర్రులాడే రోజా ఎన్నికల వంటి అవసరమైన సమయాల్లో ఇంకెలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాలా..?

 

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రోజమ్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ముఖ్యంగా మంత్రి భూమా అఖిల ప్రియ వస్త్ర ధారణ విషయంలో ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అప్పటి వరకు వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న మంచిపేరుని తగ్గించింది. ఆ తర్వాత ఆయన దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదకు మళ్లీంది..సీఎం టీడీపీకి ఓటేయకపోతే మేము నిర్మించిన రోడ్లపై తిరగొద్దంటున్నారని..అలా అయితే నువ్వు వైఎస్ వేయించిన రోడ్లపై పాదయాత్ర ఎలా చేశావంటూ ఆరోపించింది. ఇక ప్రచారానికి కొద్ది గంటల్లో గడువు ముగుస్తుందనగా..సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని "వాడు వీడు" అంటూ అనేసింది.

 

వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని కొడుకుని ఎమ్మెల్సీగా గెలిపించుకుని మంత్రిని చేసుకున్నారు ముఖ్యమంత్రి అంటూ పేలడంతో టీడీపీ అభిమానులు, ప్రజలు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. వయసుకు గౌరవం ఇవ్వకపోయినా కనీసం వారి హోదాకైనా విలువ ఇవ్వాలంటున్నారు విశ్లేషకులు. "అతి సర్వత్రా వర్జయేత్" అన్నట్లు ఏదైనా ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది కానీ ఆ స్థాయి దాటితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇప్పుడు రోజా అన్న మాటలకు ఈలలు, చప్పట్లు వినిపించినా భవిష్యత్తులో ఆమె వ్యాఖ్యలు బోర్ కొట్టించకమానవు..ఈ విషయాన్ని రోజా ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.