నంది రచ్చ "ఆయన" కోసమేనా..?

2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. నా అనుకున్న వారికి.. అయినవారికే అవార్డులు కట్టబెట్టారని తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు ఓపెన్‌గానే విమర్శిస్తున్నారు. హుందాగా, గౌరవప్రదంగా జరగాల్సిన నంది పురస్కారాల ప్రక్రియ రోడ్డుకెక్కడంతో ప్రభుత్వం పరువు మంటగలిసింది. అయినా అవార్డులన్నాకా ఇలాంటి వివాదాలు కామనే అని కొన్ని రోజులకే అంతా గప్‌చుప్ అయిపోతారని అనుకున్నారు. కానీ ఏపీలో ఆథార్ కార్డ్.. ఓటర్ కార్డు లేని వారే నంది పురస్కారాలపై విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీనికి కౌంటర్‌గా పోసాని కృష్ణమురళి కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాలను షేక్ చేశాయి.

 

దేశంలో ఏ ప్రాంతం వారినైనా విమర్శించాలనుకుంటే.. అక్కడ ఆథార్, ఓటర్ కార్డ్ ఉండాలా అంటూ సెటైర్ వేశాడు. రెండు, మూడు రోజుల్లో ముగిసిపోతుందనుకున్న వివాదం కాస్తా టీవీ సీరియల్‌లా సాగిపోతోంది. అయితే దీని వెనుక ఏదో స్కెచ్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. అధికారమే లక్ష్యంగా ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు వైసీపీ అధినేత జగన్. మూడువేల కిలోమీటర్లను ఆరు నెలల్లో చుట్టి రావాలన్నది టార్గెట్. మరి తాను ఇంత కష్టపడుతున్నప్పుడు ఇది జనాల్లోకి వెళ్ళాలి కదా..? మాట్లాడుకోవాలి కదా..? ఇందుకోసం ఏం చేయాలి అన్న దానిలో భాగంగా వైసీపీ ఎన్నికల ప్రచార కర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహాన్ని సిద్ధం చేశారు.

 

తన సొంత టీవీ, పత్రికల్లో వార్తలు వస్తే కొందరే చూస్తారు.. కానీ మిగతా వాటిలో కూడా తన యాత్ర గురించి రావాలి కదా..? అందుకే యాత్రకు ముందే మీడియా అధిపతులు, రిపోర్టర్లు, డెస్క్ సభ్యులను కలిసి తన తండ్రి యాత్రను కవర్ చేసినట్లే, తన యాత్రకు కూడా భారీ స్థాయిలో కవరేజ్ అందించాలని జగన్ విజ్ఞప్తి చేశారట. అయితే ఇప్పుడు తన సొంత మీడియాలో తప్పితే... మిగతా టీవీలు, పేపర్లలో జగన్ పాదయాత్ర సింగిల్ కాలమ్‌కి కూడా నోచుకోలేని పరిస్థితి. అంతకు ముందే అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన జగన్... టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించారు. తద్వారా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఎలా సాగుతుందో జనం చూసి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారని వైసీపీ అధినేత ఆశించారు.

 

కానీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాదు కదా..? ఆఖరికి ఇవాంక ట్రంప్‌పై వస్తున్న ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ను కూడా పక్కకు నెట్టిన జనం నంది అవార్డులకు సంబంధించిన వార్తలనే ఎక్కువగా బ్రౌజ్ చేశారు. ఇక జగన్ పాదయాత్రను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. ఇప్పటి వరకు 200 కిలోమీటర్లు నడిచిన జగన్‌కి తాను ఆశించిన ఫలితం దక్కుతుందా అన్న మీమాంసలో పడిపోయారట. పైగా ప్రజాస్పందన కూడా అంతంత మాత్రంగానే ఉండేసరికి వైసీపీ శ్రేణుల ముఖాల్లో నెత్తురు చుక్క కనిపించడం లేదు. మీడియా దృష్టిని మళ్లించడం అనే ప్రక్రియలో భాగంగా.. కావాలనే ఎవరో నంది అవార్డుల రచ్చని వెనకుండి నడిస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.