తెలంగాణ ఎన్నికల బరిలో కళ్యాణ్ రామ్..!!

 

తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.. ఇప్పటికే ఎవరి ఊహలకు అందకుండా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు టిజెఎస్, సీపీఐ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. కేసీఆర్ కి అధికారాన్ని దూరం చేయటమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది.. కేసీఆర్ ని ఓడించటం కోసం సీట్ల త్యాగాలకు కూడా ఈ పార్టీలు సిద్దపడ్డాయి.. మరోవైపు ఈ నాలుగు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు.. కొత్త ప్రణాళికలు, కొత్త వ్యూహాలతో కేసీఆర్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.. అలాంటి వ్యూహమే వారసులను తెరమీదకు తీసుకురావడం.. దానిలో భాగంగానే నందమూరి కళ్యాణ్ రామ్ ను ఎన్నికల బరిలోకి దించాలని మహాకూటమి భావిస్తోందట.

 

 


నందమూరి కుటుంబానికి సినీ, రాజకీయ రంగాల్లో మంచి పేరుంది.. ఆ కుటుంబాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు.. విభజన అనంతరం టీడీపీ ఏపీలో అయితే అధికారంలోకి వచ్చింది కానీ, తెలంగాణలో మాత్రం వెనకపడిపోయింది.. మహాకూటమితో తిరిగి ట్రాక్ లోకి రావాలని చూస్తున్న టీడీపీకి, నందమూరి వారసులు కూడా తోడైతే తెలంగాణలో పార్టీ పూర్వవైభవానికి పూలబాట పరిచినట్టవుతోంది.. అందుకే తెలంగాణ టీడీపీ కళ్యాణ్ రామ్ వైపు చూస్తోంది.. అదీగాక హరికృష్ణ ఈమధ్య రోడ్డు ప్రమాదంలో మరణించారు.. కళ్యాణ్ రామ్ ని బరిలోకి దించితే ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా ఉంటుందని తెలంగాణ టీడీపీ భావన.. ఇప్పటికే ఈ విషయంపై సీనియర్ నేతలు నందమూరి కుటుంబంతో చర్చించినట్టు తెలుస్తోంది.. మొదట కళ్యాణ్ రామ్ అంగీకరించనప్పటికీ, తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ భవిష్యత్తు కోసం రావాలని నేతలు పట్టుబట్టడంతో ఆయన కాస్త మెత్త బడినట్టు తెలుస్తోంది.. మరోవైపు మహాకూటమిలోని మిగతా పార్టీలు కూడా కళ్యాణ్ రామ్ రాకను స్వాగతిస్తున్నట్టు సమాచారం.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి స్థానాలు కేటాయించాలని టీడీపీ నేతలు కోరగా, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పోటీ చేస్తే ఆ స్థానాలు వదులుకోవడానికి సిద్ధమని కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది.. దీంతో ఈ రెండు స్థానాల్లో ఏదొక స్థానం నుండి కళ్యాణ్ రామ్ పోటీ చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి కళ్యాణ్ రామ్ నిజంగానే తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగుతారా? ఒకవేళ దిగితే తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతారు? ఇలాంటి విషయాలు తెలియాంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో.