అమరావతిలో బసవతారకం ఆసుపత్రి

తెలుగు నాట క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అత్యుత్తమ వైద్య సేవల్ని అందజేస్తోన్న బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటుకానుంది. ఈ విషయాన్ని ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బసవ తారకం ఆసుపత్రిలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా ముందు ప్రజలంతా సమానమేనని.. చిన్నా పెద్ద తేడా లేదన్నారు. ఉన్నది నలుగురికి పంచాలన్న ఉద్దేశ్యంతోనే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి సహాయం చేసేందుకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. వచ్చే నెలలో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరులో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు.