ములాయం సింగ్‌ రావణుడు... మాయావతి శూర్పణఖ

 

ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలు తమ నోటికి వచ్చినట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ పౌర విమానయాన మంత్రి నంద్ గోపాల్ గుప్తా కూడా ఆ జాబితాలో చేరారు. అలహాబాద్ లో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ‘‘కలియుగంలో రావణుడు ములాయం సింగ్‌గా, ఆయన సోదరి శూర్పణఖ మాయావతిగా పుడతారు. వారు ముఖ్యమంత్రులు కూడా అవుతారని శ్రీరాముడు చెప్పాడు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా... సమాజ్‌వాదీ పార్టీ నేతలైన శివపాల్ యాదవ్‌ను కుంభకర్ణుడి (రావణుడి సోదరుడు) గా, అఖిలేశ్ యాదవ్‌ను మేఘనాథుడి (రావణుడి కుమారుడు) గా అభివర్ణించారు. ‘‘మేఘనాథుడా.. నువ్వు రాష్ట్ర ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రివి అయ్యావు’’ అని మంత్రి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఇంకా ఢిల్లీ ముఖ్యమంత్రి అర్‌వింద్ కేజ్రీవాల్‌ను రావణుడి మేనమామ మారీచుడితో పోల్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ప్రధాని నరేంద్రమోదీ రాముడితోనూ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడితోనూ మంత్రి గారు అభివర్ణించారు. ఇక మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బీజేపీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.