పశ్చిమ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తధ్యం
Published on: Sat Feb 18, 2012 3:10PM
పదవులు రాని నాయకుల శాపనార్థాలు
పశ్
చిమగోదావరి జిల్లా: నామినేటెడ్ పదవులు రావు. పార్టీ పదవులు లేవు. ఇలాగయితే పార్టీ పటిష్టం ఎలా అవుతుంది? పదవుల్లేకుండా మేము ఎలా పనిచేయాలి అని పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో పిసిసి అధ్యక్షులు బొత్సా సత్యనారాయణ జిల్లా పర్యటనకు రానున్న నేపధ్యంలో ముఖ్య కార్యకర్తలు భీమవరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటన సైతం తమకు తెలియడంలేదని, ఇలాగయితే పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గ్రామ, మండల, పట్టణ కమిటీలు కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాయని వారు ఏకరువు పెట్టారు. నామినేటెడ్ పదవుల విషయంలో నిజమైన కార్యకర్తలు అన్యాయం జరిగిందన్నారు. నర్సాపురం, పోలవరంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా పార్టీ అధిష్టానం కళ్ళు తెరిచి తమకు సముచిత స్థానం ఇవ్వాలని, లేకపోతే పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కవని వారు హెచ్చరించారు.


