రాజకీయం మారుతోంది..నల్లపురెడ్డి స్వరం మారుతోంది..!
Published on: Mon Jun 13, 2022 1:02PM
వైసీపీ నాయకులలో ఒక్కరొక్కరుగా తెలుగుదేవంపై విమర్శల దాడిని తగ్గించేస్తున్నారు. తగ్గించడమే కాదు.. తెలుగుదేవం అధినేత చంద్రబాబునాయుడిపై ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు. ఇది రాష్ట్రంలో మారుతున్న రాజకీయానికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోట తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రమాబుపై ప్రశంసల జల్లు కురవడాన్ని చూపుతున్నారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబువై విమర్శలతో చెలరేగిపోవడంలో ముందుండే నేత. నెల్లూరు జిల్లాలో ఆయనకు ఉన్న గుర్తింపే అది. అటువంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నోట చంద్రబాబుపై ప్రశంస వినిపించింది. అదీ ప్రైవేటు సంభాషణలోనో, పిచ్చాపాటి ఇష్టాగోష్టిలోనో కాదు.. ఒక బహిరంగ సభలో. అదీ ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార సభలో. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా నల్లపురెడ్డి పక్కనే ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోట చంద్రబాబుపై ప్రశంసలు రావడంతో నివ్వెరపోయి, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా నారాయణస్వామితో కలిసి మేకపాటి విక్రమ్‌రెడ్డి విజయం కోసం సంగం మండలంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో. జంగాలకండ్రికలో జరిగిన బహిరంగసభలో చైతన్యరథంపై నుంచి ప్రసన్న ప్రసంగిస్తూ ఆత్మకూరులో పోటీ పెట్టరాదని నిర్ణయించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు.
తెలుగుదేశం అధినేతను మనం అభినందించాలి, ఎవరైనా ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే.. ఆ కుటుంబంలోని వ్యక్తి ఆ స్థానంలో పోటీకి దిగితే ఆ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉంటామని చెప్పి, ఆ నిర్ణయానికి కట్టుబడిన చంద్రబాబును అభినందిస్తున్నాను అని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రచార సభలో చెప్పారు. అదే సమయంలో బీజేపీపై విమర్శలతో చెలరేగిపోయారు.
బీజేపీకి కనీస జ్ణానం లేకుండా పోయిందని, గౌతమ్‌రెడ్డి చనిపోయిన తరువాత విలేకరుల సమావేశాలు పెట్టి చాలా మంచి వాడు, మనసున్న మహారాజు, అందరినీ దగ్గరకు తీసుకుంటారని పొగిడిన బీజేపీ వారు.. ఆత్మకూరులో తగుదునమ్మా అంటూ గౌతమ్ రెడ్డి సోదరుడిపై పోటీకి దిగడం దారుణం, దురద్రుష్టకరం అంటూ విమర్శించారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. పక్క చూపులు చూస్తున్న వైసీపీ నేతల జాబితాలో ఆయన కూడా చేరిపోయారా అన్న చర్చ పార్టీలో జోరందుకుంది. ఏది ఏమైనా వైసీపీ నేతలెవరూ తెలుగుదేశంపై, తెలుగుదేశం అధినేతపై గతంలోలా విమర్శలు చేయడానికి జంకుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయానికి ఇది నిదర్శనమని పరిశీలకులు విశ్లేషణలకు పదును పెడుతున్నారు.


