ప్రసన్న మెజార్టీపై జోరుగా బెట్టింగులు
Published on: Fri Mar 16, 2012 4:35PM
నెల్లూరు జిల్లా కొవూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో 14 మంది పోటీపడుతున్నారు. వీరిలో 8 మంది రాజకీయ పార్టీల తరపున, 6గురు స్వతంత్ర అభ్యర్ధులుగా రంగంలో ఉన్నారు. తాజా మాజీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లప రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 30 వేల వరకూ మెజార్టీ వస్తుందని కుడ్డ వారు చెబుతున్నారు. అయితే బెట్టింగ్ రాయుళ్ళు మాత్రం ఆయనకు 5 వేల నుంచి 10 వేల వరకూ మాత్రమే మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు.
దీనికి తోడు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలో కూడా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోందని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికలకు ముందు 30 వేల వరకు మెజార్టీ వస్తుందని అంచనావేసిన రాజకీయ పరిశీలకులు ఇప్పుడు దానిని 5 నుంచి 10 వేలకు తగ్గించారు. అయితే చివర్లో ఏమైనా అనూన్య పరిస్థితులు ఎదురైతే ప్రసన్నకుమార్ రెడ్డి గెలవడం మాట అంటుంచి ఓడిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదని ప్రత్యర్ధి పార్టీల నాయకులు అంటున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్లను మాత్రమే చీల్చుకుంటాడు తప్ప, తమ ఓట్లను చీల్చుకునే అవకాశం లేదని, అందువల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు పరాజయం పాలుకాక తప్పదని టిడిపి నాయకులు అంటున్నారు. అయినా ప్రసన్నకుమార్ రెడ్డి మెజార్టీపై ఇంకా బెట్టింగులు కాస్తుండటం విశేషం.


