నళినికి షాక్..బిజెపి మద్దతు కరువు
Published on: Tue Apr 3, 2012 11:08AM
వ
రంగల్: పరకాల ఉప ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నానని, తనకు మద్దతివ్వాలని మాజీ డిఎస్పీ నళిని సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాంను కలిసి విజ్ఞప్తి చేశారు. నళిని వారిని వేరు వేరుగా కలిశారు. తెలంగాణ కోసం ఉన్నతమైన పదవిని తాను త్యాగం చేశానని వారికి తాను వివరించినట్లు నళిని చెప్పారు.
పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తే ఆ స్థానంపై జాతీయ స్థాయి చూపు ఉంటుందని, అది తెలంగాణపై రెఫరెండంగా భావించే అవకాశాలు ఉన్నాయని వారితో చెప్పానని ఆమె అన్నారు. తనకు మద్దతిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని వివరించినట్లు చెప్పారు. అయితే తాము పరకాలలో పోటీ చేయాలని నిర్ణయించినందున మద్దతు ఇవ్వడం కుదరదని నళినికి కిషన్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. కాగా తాను వచ్చే ఉప ఎన్నికల్లో తాను పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మాజీ డిఎస్పీ నళిని ఆదివారం తెలిపిన విషయం తెలిసిందే.


