విగ్రహాల ధ్వంసం ఉద్రిక్తత
Published on: Mon Jan 23, 2012 1:19PM
నల్
గొండ: రాష్ట్రంలో రెండు జిల్లాల్లో విగ్రహాల ధ్వంసం ఉద్రిక్తతలకు దారి తీసింది. నల్గొండ జిల్లాలోని చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో ఉదయం కొందరు దుండగులు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దుండగుల దాడిలో విగ్రహం చేయి విరిగి పడిపోయింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల స్థానిక తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలు విగ్రహం ముందు బైఠాయించారు. నిందితులు ఎవరో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకు నిరసనగా ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు తూర్పూ గోదావరి జిల్లాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో దళిత సంఘాలు ఆందోళన చేశాయి.అంబేద్కర్ విగ్రహాలపై దాడి శోచనీయమన్నారు. కాగా అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ ఆదివారం హైదరాబాదులో కాంగ్రెసులో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు ఇవ్వడంతో దళితులు పార్టీకి దూరమయ్యే అవకాశముందని, పిఆర్పీకి అంత ప్రాధాన్యత ఇవ్వడమేమిటని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆ కోణంలో దృష్టి సారిస్తున్నారు.


