ఇదేం వింత.. హృదయం పోయిందని పోలీసులకు ఫిర్యాదు

 

అది నాగపూర్ లోని ఓ పోలీస్ స్టేషన్. పోలీసులు ఎప్పటిలాగానే వారివారి పనులతో బిజీగా ఉన్నారు. ఇంతలో అక్కడికో యువకుడు వచ్చాడు. సార్ నాకు సంబంధించిన విలువైన దాన్ని దోచుకెళ్లారు సార్ అంటూ ధీనంగా ఫేస్ పెట్టాడు. పాపం ఇంత బాధపడుతున్నాడంటే బాగా విలువైన వస్తువు అనుకుంటా.. అంటూ ఎఫ్ఐఆర్ రాయడానికి సిద్ధమయ్యారు. చెప్పు బాబు ఏ వస్తువు పోగొట్టుకున్నావు? ఎక్కడ పోగొట్టుకున్నావు? డీటైల్స్ చెప్పు. 24 గంటల్లో దొంగని పట్టుకుంటాం అంటూ పోలీసులు కాన్ఫిడెంట్ గా చెప్పారు. దానికి ఆ యువకుడు పోయింది వస్తువు కాదు సార్.. నా హృదయం అన్నాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారికేం అర్థంగాక హృదయం పోవడమేంటి అని అడిగారు. దీనికి ఆ యువకుడు ఒక అమ్మాయి నా హృదయం దోచుకుంది సార్ అన్నాడు. అతని పిచ్చిని చూసి నవ్వాలో ఏడవాలో పోలీసులకు అర్థంగాక తలలు పట్టుకున్నారు. బాబు ఇప్పటివరకు ఇలాంటి కేసులు తమ పరిధిలోకి రాలేదు. ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలో కూడా తమకు తెలియడం లేదన్నారు. మహాప్రభూ ఈ కేసును మేం ఫైల్ చేయలేమని బ్రతిమాలి, బుజ్జగించి ఆ యువకుడిని వెనక్కి పంపించారు. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంటది పిచ్చి పలు రకాలని.