వాట్సాప్ లో విడాకులు

 

ఓ అరుదైన సంఘటనకు నాగ్‌పుర్ ఫ్యామిలీ కోర్టు వేదికైంది. వాట్సాప్‌ వీడియో కాల్ సాయంతో అమెరికాలో ఉన్న భార్య, భారత్‌లో ఉన్న భర్త విడాకులు తీసుకున్నారు. విద్యార్థి వీసా మీద మిచిగాన్‌లో చదువుతోన్న భార్య(35) సుదీర్ఘ కాలంపాటు సెలవు ఇవ్వడంలేదని, విచారణకు హాజరు కాలేనని వెల్లడించడంతో న్యాయస్థానం ఈ కొత్త విధానాన్ని అనుసరించింది. వాట్సాప్‌ వీడియో కాల్ ద్వారా ఈ విచారణ చేపట్టాలన్న ఆమె అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో మిచిగాన్‌లో ఉద్యోగం చేసే భర్త(37) మాత్రం నాగ్‌పుర్ కోర్టు ముందు హాజరయ్యారు. ఇరుపక్షాలు అంగీకరించడంతో నాగ్ పూర్ ఫ్యామిలీ కోర్ట్ న్యాయమూర్తి స్వాతి చౌహాన్ విడాకులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ మహిళకు ఒకేసారి పరిహారం కింద రూ.10 లక్షలు చెల్లించాలని షరతు విధించారు. కోర్టు ఈ ఆదేశాలను 14 జనవరి న ఇచ్చింది. కోర్టు సూచన మేరకు ఫ్యామిలీ కోర్ట్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా భార్య అంగీకారాన్ని నమోదు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే...2013లో నాగ్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తి, సికింద్రాబాద్‌ వాసి అయిన ఓ అమ్మాయి పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటయ్యారు. ఇంజనీరింగ్ పట్టభద్రులైన వారు అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలో పనిచేసేవారు. అయితే యూఎస్‌ వీసా గడవు ముగియడంతో భార్య నాగ్ పూర్ లోని అత్తారింటికి చేరింది. అప్పటినుంచి వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తర్వాత ఆమె విద్యార్థి వీసా మీద మిచిగాన్ వెళ్లినా.. వారి మధ్య సఖ్యత కుదరకపోగా, మరింత దూరం పెరిగింది. దాంతో భర్త నాగ్‌పుర్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. నిబంధనల ప్రకారం ఆ కేసును కౌన్సిలర్‌కు అప్పగించారు.  భార్య తరఫున ఆమె సోదరుడు హాజరయ్యాడు. తర్వాత భర్తను ప్రశ్నించగా ఇద్దరూ విడాకులకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. వారిద్దరూ ఇప్పటికే సంవత్సరం నుంచి విడిగా ఉంటున్నారని, వారికి విడాకులు మంజూరు చేయాలని ఇరు వర్గాల న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. దీంతో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు.