కాంగ్రెస్ లోకి నాగం జనార్ధన్..

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ ఉదయం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. నాగంతో పాటు ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు జీవీ సూర్యకిరణ్ వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని అన్నారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పారు. కాగా, తనకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఈ సందర్భంగా సూర్యకిరణ్ వెల్లడించారు.

 

కాగా మూడు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగుతున్న నాగం జనార్దన్‌రెడ్డి ఆరు పర్యాయాలు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా కొనసాగిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం సందర్భంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ నగారా సమితిని స్థాపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నగారా సమితిని బీజేపీలో విలీనం చేశారు. ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గానికి, ప్రాథమిక సభ్యత్వా నికి రాజీనామా సమర్పించారు.