TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాగం ఇంటివద్ద పోలీసుల హంగామా

Published on: Sat Mar 17, 2012 2:12PM

నాగర్ కర్నూలు : ఉప ఎన్నికలు జరగనున్న నాగర్‌కర్నూలులో శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. జిల్లా నాగర్ కర్నూలు స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి ఇంట్లోకి మఫ్టీలో ఉన్న ముగ్గురు పోలీసులు ప్రవేశించారు. నాగం జనార్దన్ రెడ్డి ఇంట్లోకి  తాము తనిఖీల కోసం వచ్చామని వారు చెప్పారు. వారి చర్యలకు ఆగ్రహించిన నాగం జనార్దన్ రెడ్డి వర్గీయులు ఓ కానిస్టేబుల్‌ను నిర్బంధించారు. మరో ఇద్దరు పోలీసులు పారిపోయారు. నాగం జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు పెద్ద యెత్తున మోహరించారు. నాగం ఇంట్లో నిర్బంధించిన పోలీసు కానిస్టేబుల్‌ను విడిపించడానికి ఎఎస్పీ వచ్చారు. ఈ సందర్భంగా నాగం ఎఎస్పీ  తో వాగ్వివాదానికి దిగారు.

నాగం జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో నాగం జనార్దన్ రెడ్డి వర్గీయులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బయటి నుంచి వ్యక్తులు నాగం ఇంట్లో ఉన్నారా అనే విషయం తెలుసుకోవడానికి తాము వచ్చామని పోలీసులు చెప్పారు. వారి వాదనకు నాగం వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగం ఇంటి వద్ద కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనుమతి లేకుండా సోదాలు చేస్తూ పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు నాగం తెలిపారు. తన అనుచరులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన విజయాన్ని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. కాగా నాగం నివాసంలో అపరిచిత వ్యక్తులు స్థానికేతరులు ఉన్నారన్న సమాచారంతోనే తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ లక్ష్మీరెడ్డి చెప్పారు.