జనసేనకు అండగా చిరంజీవి!!

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జనసేనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉండనుందని తెలిపారు. బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తోడు ఉంటారని అన్నారు. పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి చిరంజీవి కారణమని తెలిపారు. ఓ రెండు మూడేళ్లు సినిమాలు చేయాలని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలు చేసుకోవాలని పవన్ ‌కు చిరంజీవి సూచించారని.. ఆయన సూచన మేరకే పవన్ సినిమాలు చేస్తున్నారన్నారు. పవన్ తో కలిసి నడిచేందుకు తాను సిద్ధమేనన్న సానుకూల సంకేతాలను చిరంజీవి ఇచ్చారని తెలిపారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను కూడా అండగా నిలుస్తానని చిరంజీవి హామీ ఇచ్చారన్నారు. 

 

నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఖాయమని జనసేన కార్యకర్తలు అంటున్నారు. కాగా, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి.. కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాతర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తాజాగా నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీని బలపరిచేవిగా ఉన్నాయి.