సీనియర్ల దక్కని చోటు.. జీవీఎల్ కు అదే మైనసా! 

భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కమిటిలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి చోటు దక్కగా.. గతంలో కమిటీలో పనిచేసిన ముగ్గురు సీనియర్లను తప్పించారు. ఇప్పటివరకు బీజేపీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రాంమాధవ్‌, మురళీధర్‌రావులను తప్పించారు. జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నరసింహరావును ఈసారి జాతీయ కమిటీలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు సీనియర్ నేతలకు జేపీ నడ్డా టీమ్ వో  చోటు దక్కకపోవడంపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. బీజేపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

                   
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్‌ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో తలదూర్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అన్ని అంశాల్లోనూ జీవీఎల్ వైఖరి వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుందనే గతంలోనే హైకమాండ్ కు కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు. అమరావతి విషయంలోనూ రాష్ట్ర నేతల అభిప్రాయానికి భిన్నంగా జీవీఎల్ ప్రకటనలు ఇచ్చేవారనే విమర్శలు బీజేపీలోనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపై వచ్చే అవినీతి ఆరోపణల విషయంలోనూ జీవీఎల్ ప్రకటనలు రాష్ట్ర పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పోరాడాలని భావించిన రాష్ట్ర నేతలకు జీవీఎల్ ప్రకటనలు చాలా సార్లు అడ్డంకులు కల్పించాయి. దీంతో రాష్ట్ర నేతల నుంచి వచ్చిన అభిప్రాయాలు.. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలించాకే జీవీఎల్ ను అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించిందని  బీజేపీ వర్గాల్లో  ప్రచారం జరుగుతోంది. 

 

జాతీయ కమిటీలో స్థానం కోల్పోయిన తెలంగాణకు చెందిన సీనియర్ నేత మురళీధర్‌రావుపైనా ఇదే రకమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మురళీధర్ సన్నిహితంగా ఉంటారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటంలో ఆయన ఎప్పడూ యాక్టివ్ గా లేరని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయనను తప్పించారని సమాచారం. కరీంనగర్ కు చెందిన బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున.. అదే జిల్లాకు చెందిన మురళీధర్ రావును జాతీయ కమిటి నుంచి తప్పించారనే చర్చ కూడా జరుగుతోంది. ఉత్తర తెలంగాణ వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందున..దక్షిణ తెలంగాణకు చెందిన డీకే అరుణకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కట్టబెట్టారని భావిస్తున్నారు. 
 

పార్టీ సినియర్ నేత రాంమాధవ్ ను జాతీయ కమిటి నుంచి తప్పిస్తారని చాలా  కాలంగా ప్రచారం జరుగుతోంది. రాంమాధవ్‌ను గత కొంతకాలంగా పార్టీ వివిధ బాధ్యతల నుంచి తప్పిస్తూ వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ త్వరలో తన కేబినెట్‌ను విస్తరించనున్నట్లు, అందులో రాంమాధవ్ కు అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రాంమాధవ్ కు జాతీయ కమిటీలో చోటు దక్కలేదంటున్నారు. 

 

భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యత దక్కింది. ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు నేతలతు జేపీ నడ్డా టీమ్ లో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు వైస్ ప్రెసిడెంట్  ఏపీ నుంచి  దగ్గుబాటి పురందేశ్వరికి  జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించారు.