TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మరోసారి వింత వ్యాధి కలకలం.. మూర్చతో పడిపోతున్న జనం!!

Published on: Tue Jan 19, 2021 2:13PM

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరును గడగడలాడించిన వింత వ్యాధి తాజాగా భీమడోలు మండలం పూళ్ల గ్రామాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏలూరులో వచ్చిన వింత వ్యాధికి గల కారణాలు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాక ముందే.. ఇవే లక్షణాలు మరోసారి కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 16న పూళ్ల గ్రామంలో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. తరువాత అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన 10 మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో వైద్య వర్గాల్లో ఆందోళన నెలకొన్నది. నిలుచున్న వారు నిలుచున్నచోటే కుప్ప కూలిపోవడం, ఫిట్స్‌తో కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించడంతో వింత వ్యాధేమోనన్న భయంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల ప్రజలు అస్వస్థతకు గురి అయ్యి ఉండొచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తిస్థాయి వివరాలు తెలిసే అవకాశముంది. 

 

కాగా, గత డిసెంబర్లో ఏలూరులో వింతవ్యాధి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. 600 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీరు కలుషితం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని అప్పట్లో భావించారు. తాజాగా పూళ్ల గ్రామంలో 10 మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో.. నీటి కాలుష్యమే కారణమా? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.