మైసూరా కూడా పాయే..జగన్‌కి ఇక పెద్దదిక్కెవరు..?

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేధ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి లాక్కుంటున్నారంటూ ఢిల్లీ లెవల్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు వైసీపీ అధినేత జగన్. అక్కడ చంద్రబాబుపై పుస్తకం రిలీజ్ చేసి 24 గంటలు గడవకముందే జగన్‌కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ కురువృద్ధుడుగా అభివర్ణించే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతోనే పార్టీని వీడినట్లు తెలిపారు. ఏకంగా మీడియా సమావేశం పెట్టి జగన్‌ని ఏకీపారేశారు.

 

గతంలో అందరూ చెప్పినట్లుగానే జగన్ ఒక మోనార్క్ అని, ఎవ్వరి మాట వినరన్నారు. ప్రతిపక్షనేతగా ప్రజల పక్షాన పోరాడే ధ్యాస జగన్‌కు లేదని విమర్శించారు. వైసీపీలో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో ఉండటం అనవసరమని..ప్రజాస్వామ్యంపై జగన్‌కు నమ్మకం లేదని..పార్టీలోని పరిణామాలు స్వార్థ రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వలస వెళ్లినా జగన్‌కి పెద్దగా నష్టం లేదు. కానీ మైసూరా పార్టీని వీడటం పెద్ద లోటే. ఎందుకంటే పార్టీని స్థాపించిన కొద్ది రోజులకే జగన్ జైలుకు వెళితే పార్టీని నడిపింది..బలోపేతం చేసింది మైసూరానే..దానికి తోడు జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీని విస్తరించి టీడీపీని ఒక్క స్థానానికే పరిమితం చేసిన ఘనత మైసూరాదే.

 

అలాంటి తనకి పార్టీలో సరైన గౌరవం దక్కలేదని, రాజ్యసభ టికెట్ విషయంలోనూ తనను పరిగణనలోనికి తీసుకోకపోవడం మైసూరాను బాధించింది. అందుకే పార్టీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు. మిగతా నేతలంతా సైలెంట్‌గా పార్టీని వీడితే మైసూరా మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్ ఒంటెత్తు పోకడలను విమర్శించారు. మైసూరాను కోల్పోయిన జగన్ పరిస్థితి చాణుక్యుడు లేని చంద్రగుప్తుడిలా మారింది. మరి ఈ నేపథ్యంలో యువనేత, మైసూరాతో మంతనాలు జరిపి రాజీనామాను ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ప్రారంభిస్తారా లేక పోతే పోనీ పోరా? అంటారా అనేది వేచి చూడాలి.