రాహుల్ ది ఐరన్ లెగ్గు:మైసూర

 

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని జైలు నుంచి విడుదల చేయడం గురించి ముందు మాట్లాడి, ఆ తరువాత పొత్తుల గురించి కాంగ్రెస్ మాట్లాడి ఉంటే వారు కొంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉండేదేమో. నిన్నజగన్ బెయిలు పిటిషనుపై జరిగిన విచారణలో, ప్రభుత్వం తమకు సహకరించడం లేదనే నెపంతో సిబిఐ జగన్ బెయిలు రాకుండా చేయడంతో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ దురుదేశ్యం బయటపడిందని యస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీకి చెందిన మైసూరా రెడ్డి వంటి నేతలు తమ నాయకుడిని జైల్లో బందించి పొత్తుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

 

రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూర రెడ్డి స్పందిస్తూ, “వరుసగా మూడు రాష్ట్రాలలో పార్టీని ముంచిన రాహుల్ గాంధీని ఇప్పుడు నాయకుడిగా చేసుకొని, మళ్ళీ ఎన్నికలకి సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. ఆయనది ఐరన్ లెగ్గని తెలిసీ కూడా కాంగ్రెస్ ఆయనకు నాయకత్వం కట్టబెట్టడం చూస్తుంటే, ఆ పార్టీ తానూ మునగడమే గాకుండా ఏకంగా దేశాన్నికూడా ముంచేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ పరిస్థితికన్నా దారుణంగా ఉందని” మైసూరా అన్నారు.

 

ఇక మజ్లిస్ పార్టీతో స్నేహం కోరుకొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతల అరెస్ట్ పై సానుభూతిగా స్పందిస్తూ “కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతు ఉపసంహరించినందుకే ఇటువంటి వేధింపులకి పాల్పడుతోందని” మైసూరా అన్నారు.