TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ముస్లిములు ఈ దేశంలో కిరాయిదారులు కాదు సమాన హక్కుదార్లు

Published on: Sat Jun 1, 2019 1:26PM

 

2019 లో జరిగిన లోకసభ ఎన్నికలలో బీజేపీ 300 లకు పైగా ఎంపీ సీట్లు సాధించి మరో సారి అధికారంలోకి వచ్చిందని ముస్లింలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... దేశంలోని ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రధాని మోదీ దేవాలయాలను సందర్శిస్తే... ముస్లిములు మసీదులను సందర్శించాలని చెప్పారు. మోదీ గుహల్లో ధ్యానం చేస్తే... మేము మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటామని గర్వంగా చెబుదామని అన్నారు. భారత్ లో సజీవమైన గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉందని చెప్పారు. ఎన్నికలలో బిజెపి ఎంత గొప్ప మెజారిటీ సాధించినా మైనారిటీల హక్కులను కాలరాయలేదని ఒవైసి అన్నారు.

భారత దేశ చట్టాలు ఎవరి మతాన్ని వారు ఆచరించే స్వేచ్ఛను భారతీయ చట్టాలు, రాజ్యాంగం ఇచ్చాయని ఒవైసీ తెలిపారు. భారత్ లో మైనారిటీలు కిరాయిదారులు కాదని... అందరితో సమానంగా, గౌరవంగా బతికే హక్కు వారికి ఉందని చెప్పారు. భారత్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని... మనమంతా మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు కృషి చేద్దామని తెలిపారు.

300లకు పైగా ఎంపీ సీట్లను గెలుచుకున్నంత మాత్రాన, ఏదైనా చేయవచ్చని ప్రధాని మోదీ అనుకుంటే... జరిగే పని కాదని ఒవైసీ స్పష్టం చేశారు. భారత్ కోసం తాను పోరాడుతానని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన దారుణ మారణకాండ పై స్పందిస్తూ... ఇస్లాంలో హింసకు తావు లేదని వ్యాఖ్యానించారు. ప్రార్థనా స్థలాల్లో, ఇతర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడి, 40 మంది అమాయక చిన్నారులతో సహా 200 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నవారు, ఎలాంటి ఇస్లాం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇటువంటి నరరూప హంతకులు ఇస్లాంను కాకుండా సైతాను బోధనలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు.