ముస్లింల అభద్రతా భావమే ఓట్లు రాలుస్తోందా

 

రాజకీయ నాయకులకి ప్రజలు, అందునా మైనార్టీ, పేద, మధ్య తరగతి మరియు వెనుకబడిన తరగతుల ప్రజలు మనుషుల కంటే ఎక్కువ వోట్లుగానే కనబడతారు. అందుకే ప్రజలని కులాల వారిగా, మతాలు వారిగా విభజించేసి, ఒక్కో వర్గానికి ఒక్కో రకం వరం (ఆయుధం) వాడుతూ ఓట్లు పిండు కొంటుంటారు. ఆ సంగతి సదరు వర్గాలకి తెలియకనే వారికి ఓట్లు వేస్తున్నారనుకోనవసరం లేదు. ఎవరి అవసరాలు వారివి ఎవరి బలహీనతలు వారివి. ఇదొక చక్రంలా అలా సాగిపోతూనే ఉంటుంది.

 

ఇక మన దేశంలో అందరి కంటే రాజకీయ నేతలు బాగా వాడేసుకొంటున్న వారు ముస్లిం ప్రజలు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా అన్ని’సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు’ కూడా వారిలో ఎప్పటికప్పుడు అభద్రతా భావం నిలిచి ఉండేలా చూసుకొంటూ, వారి భయం నుండే ఓట్లను పిండుకొంటున్నాయి తప్ప అత్యంత దైన్యామయిన స్థితిలో జీవితాలు గడుపుతున్నలక్షలాది ముస్లిం ప్రజల కోసం పెద్దగా చేసిందేమీ లేదు.

 

వారిలో ఎవరయినా ఒక మెట్టు పైకి ఎక్కాలంటే, వారు సమాజంలో మిగిలిన వారికంటే మరికొంత అధిక శ్రమచేస్తే తప్ప సాధ్యం కాదు. నేడు వారిలో ఏ మాత్రమయినా అభివృద్ధి కనబడుతోందంటే అది వారి స్వయం కృషితో సాధించినదే తప్ప వారికి ఏ సెక్యులర్ రాజకీయ పార్టీలు, ఏ సెక్యులర్ ప్రభుత్వాలు గానీ చేసిందేమీ లేదు.

 

ప్రముఖ ముస్లిం నేత మౌలానా మెహమూద్ మధాని మీడియాతో మాట్లాడుతూ “తమను తాము గొప్ప సెక్యులర్ పార్టీలుగా అభివర్ణించుకొనే కొన్ని రాజకీయ పార్టీలకు మా ముస్లిం ప్రజల మనవి ఏమిటంటే “మీకు మా ఓట్లు కావలసి వస్తే, అందుకు వేరేవరినో బూచిగా మాకు చూపించి మాలో అభద్రతా భావం కలిగించనవసరం లేదు. సెక్యులర్ పార్టీలుగా చెప్పుకొని మా ఓట్లు కోరే మీరు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇంత వరకు మాకోసం ఏమి చేసారో చెప్పండి. ఏమి చేయబోతున్నారో చెప్పండి. అంతే తప్ప మాలో భయాందోళనలు పెంచి, మీరే మాకు రక్షణ కలిగించగలమనే భావనతో మా ఓట్లు కోరే ప్రయత్నించకండి,” అని అన్నారు.

 

అయితే కాంగ్రెస్ పార్టీ తన సహజ సిద్దమయిన శైలిలోనే స్పందించింది. “మేము ఎవరినో బూచిగా చూపించి ఎవరినీ భయపెట్టాలనుకోవడం లేదు. అక్కడ ఇప్పటికే బూచి ఒకటుందని మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నాము.”