ప్రభుత్వ హాస్టల్ లో కరెంట్ షాక్: బాలిక మృతి.!
Published on: Tue Nov 17, 2026 3:09PM

హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో విద్యాత్ షాక్ తో ఓ విద్యార్థిని మరణించగా, మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడిన విషాద ఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న బాలికల వసతిగృహం టెర్రస్‌పై చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో దుర్ఘటన జరిగింది. భవనం పైకప్పు సమీపంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో నాలుగో తరగతి చదువుతున్న రెబికా అనే 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన నందిని అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
హాస్టల్ సిబ్బంది ఆ ఇద్దరు బాలికలను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రెబికా మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మరో బాలిక నందిని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషాద వార్త తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హాస్టల్ నిర్వహణలో అధికారుల అలసత్వం భద్రతా లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ బాలికల బంధువులు, స్థానికులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పాఠశాలల భవనాలపైకి విద్యార్థులు సులభంగా వెళ్లే చోట ఇలాంటి ప్రమాదకర హైటెన్షన్ లైన్లు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
[Musheerabad, GirlsHostel, Girl electrocuted, Studentdeath, TeluguOne]


