TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ లో మునుగోడు టెన్షన్!

Published on: Wed Aug 3, 2022 10:55AM

మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డిని బుజ్జగించి ఆయన రాజీనామా చేయకుండా నిలవరించాలన్న కాంగ్రెస్ యత్నాలు విఫలమయ్యాయి. కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ బుజ్జగింపులను బేఖాతరు చేసి రాజీనామా చేసేశారు. ఇక మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అని తేలిపోయింది.

వాస్తవంగా చెప్పాలంటే మునుగోడు.. ఆ మాటకొస్తే నల్గొండ జిల్లా మొత్తం కాంగ్రెస్ కు కంచుకోట వంటిది. అటువంటిది ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అనే సరికి కాంగ్రెస్ ఉలిక్కి పడుతోంది. ఇక్కడ ఫలితం అటూ ఇటూ అయితే.. రాష్ట్రంలో ఇంత కాలంగా పెంచుకుంటూ వస్తున్న బలం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కంటున్న కలలూ అన్నీ దూది పింజల్లా తేలిపోతాయి. అందుకే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డిని రాజీనామా చేయకుండా నిలువరించాలని విశ్వ ప్రయత్నం చేసింది ఆ పార్టీ. ఆఖరికి ఒక ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు ఏకంగా పార్టీ అధిష్ఠానమే రంగంలోనికి దిగింది.అయినా ఫలితం లేకుండా పోయింది అది వేరే విషయం. అదే సమయంలో బీజేపీ కూడా మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి, అక్కడ ఉప ఎన్నిక కోసం నానా తాపత్రేయపడింది.

ముచ్చటగా మూడో సారి రాష్ట్రంలో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించి, ఆ పార్టీకి కొద్దో గొప్పో మిగిలిన ఆత్మ విశ్వాసాన్ని పోగొట్టాలన్నది ఆ పార్టీ వ్యూహం. అందుకే ఏకంగా బీజేపీ అగ్ర నేతల్లో ఒకరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే మునుగోడు ఉప ఎన్నిక ఆపార్టీకి ఏ మంత  సంతోషం కలిగించే అంశం కాదు. అది ఎలాగూ టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాదు కనుక వాస్తవానికి అక్కడ ఉప  ఎన్నిక జరిగి టీఆర్ఎస్ పరాజయం పాలైనా ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అలా సరిపెట్టుకునేందుకు వీలు లేని విధంగా ఉంది. ఇప్పటికే తెరాస విపక్షాల నుంచి ముప్పేట విమర్శల దాడి ఎదుర్కొంటోంది. దానికి తోడు పార్టీలోనూ అంతర్గత విభేదాలు పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నికలో పరాజయం పాలైతే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి కష్టాలు, ఇబ్బందులు తప్పవు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

అంటే  మొత్తంగా బీజేపీ తప్ప  మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కోరుకోలేదు. అంతగా ఉత్సాహ పడుతున్న బీజేపీకి కూడా మునుగోడు ఉప ఎన్నికలో విజయం నల్లేరు మీద బండి నడక ఏమీ కాదనే చెప్పాలి. ఏది ఏమైనా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడు పార్టీలకూ కూడా మునుగోడు ఉప ఎన్నికలో విజయం చాలా కీలకం. అయతే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కు మాత్రంఈ ఉప ఎన్నికలో విజయం జవన్మరణ సమస్య వంటిది. మునుగోడు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ కు పరాజయం ఎదురైతే మాత్రం వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆశలకు ఆ పార్టీ నీళ్లొదిలేసుకోవలసిన పరిస్థితి వస్తుంది.

అందుకే  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికను యమ  సీరియస్‌గా తీసుకుంది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి అలా రాజీనామా ప్రకటన చేయగానే కాంగ్రెస్ క్షణం ఆలస్యం చేయకుండా మునుగోడు ఉపఎన్నికల కమిటీని నియమిస్తూ ప్రకటన చేసింది. సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో మునుగోడు ఉప ఎన్నిక కమిటీని ఏర్పాటు చేశారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి, బలరాంనాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్,   అనిల్ కుమార్‌లను సభ్యులుగా నియమించారు. మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం వంటి వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది. రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పూర్తయిన వెంటనే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌తో సమావేశం అయ్యారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి పోతారన్న సమాచారం పక్కాగా ఉండంతో ముందుగానే తదుపరి ఏం చేయాలన్నదానిపై వ్యూహాలు సిద్దం చేసుకుని రెడీగా ఉన్నారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలా రాజీనామా చేయగానే ఇలా ఉపఎన్నికల సన్నాహాలు మొదలెట్టేశారు.  శుక్రవారం (ఆగస్టు 5) మునుగోడులో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం ద్వారా పార్టీ క్యాడర్ ఎవరూ రాజగోపాల్ రెడ్డితో వెళ్లకుండా కట్టడి చేయడానికి వ్యూహాలు రచించారు.