మునుగోడు తెర మీద బీజేపీ ఆశల చిత్రం!
Published on: Fri Jul 29, 2022 10:30PM
తెలంగాణాలో ఎలాగయినా కేసీఆర్‌ను గద్దె దించేయాలన్న బీజేపీ పట్టుదలతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి లాక్కోవా లన్న ఆతృత బాగానే ప్రదర్శిస్తోంది. తెలంగాణా కాంగ్రెస్‌లో ఇమడలేని రాజగోపాల్ కారణంగా మునుగోడు రంగస్థలం మీద అనేక మలుపుల డ్రామా కొనసాగుతూనే ఉంది. ఆ
యన పార్టీ పదవికి రాజీనామా చేసేసి బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని భారీ ప్రచారాలు చేస్తున్న బీజేపీ శ్రేణులు ఒక వైపు, ఆయనను వదిలే ప్రసక్తేలేదని అంటున్న కాంగ్రెస్ నాయకులు మరో వైపు, వీరిరువురి మధ్యా తన నిర్ణయం ఇదమిద్ధం తేల్చని రాజగోపాల్. అందరూ తెలంగాణా ఓటర్ను సందిగ్ధంలో పడేశారు. సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్ని కపై బీజేపీ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఎవరి కోణంలో వారు చూస్తున్నారు.
చిత్రమేమిటంటే ఇంత హడావుడి జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం నిదానం ప్రధానం పద్దతినే ప్రదర్శిస్తోంది. సీనియర్ నాయ కుడిని ఉన్నపళాన వదలుకోలేని స్థితి వారిది. తాను ఏమాత్రం ఉండలేనని రాజగోపాల్ పట్టుదల వెరసి మునుగోడు అంశాన్ని తెరమీద రక్తికట్టిస్తున్నారనాలి. పార్టీ మార్పుపై స్పష్టతతో ఉన్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా, పోటీపై రాజగోపాల్‌రెడ్డి డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాను ఎన్నటికీ మునుగోడును వదిలి వెళ్లనని ప్రకటించిన ఆయన.. కార్య కర్తలను కాపాడుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి ఏ మాత్రం పట్టులేదు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో కదలిక తెచ్చేందుకు వ్యూహాత్మకంగానే రాజగోపాల్‌రెడ్డిని బీజేపీ ఎంచుకుందన్న ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, ఉప ఎన్నిక ఖాయమని టీఆర్ఎస్ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇస్తుండడంతో ఆశావహులు పెద్ద సంఖ్య లో పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు. సర్వేల్లో తమ పేర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నారు. రాత్రివేళ విందు సమావేశాలు జోరుగా నడుపుతున్నారు. ఉప ఎన్నిక వస్తే దళిత బంధు, ఆసరా పెన్షన్, రోడ్లు వంటివి పెద్ద సంఖ్యలో మంజూరు కావడమే కాకుండా ఓటుకు పెద్ద సంఖ్యలో రేటు పలికే అవకాశం ఉంటుందని కుల సంఘాలు నేతలు, ఓటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు జోరుగా చర్చించుకుంటున్నారు.


