TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అప్పుడు.. భారత హోం శాఖను పాక్ "కంట్రోల్‌"లోకి తీసుకుందా..?

Published on: Sat Jun 11, 2016 5:16PM

26/11 ఎటాక్..ముంబైపై దాడి.. ఇలా పేరేదైనా దేశ చరిత్రలో చీకటి రోజు అనదగ్గ సంఘటన. 2008 నవంబర్ 26వ తేదీన పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో ముంబై చిగురుటాకులా వణికిపోయింది. ఈ దాడిలో 180 మందికిపైగా అమాయక ప్రజలు మృత్యువాత పడగా, మరో 700 మంది వరకు గాయపడ్డారు. నాడు ముష్కరులు సృష్టించిన భయోత్పాతాన్ని తలుచుకుంటే ఒక్క ముంబై వాసులే కాదు..దేశ ప్రజలు నిలువెల్లా వణికిపోతున్నారు. తాజాగా ఆ మానని గాయం మరోసారి రేగింది.

 

ఈ దాడుల సమయంలో మన హోంశాఖ ఉన్నతాధికారులు పాక్ ఆధీనంలో ఉన్నారని దాంతో పాటు దేశం తగలబడిపోతుంటే వీళ్లు పాక్ ఆతిథ్యంలో మునిగి తేలారంటూ సంచలన కథనాలు ప్రసారమవుతున్నాయి. భారత్‌పై ఉగ్రవాదులు దాడి చేస్తారని పాక్ అత్యున్నత అధికార వర్గానికి ముందే తెలుసన్నది ఆ వార్తల సారాంశం. అందుకే ఉగ్రవాదులు తమ పని కానిచ్చేందుకు ఆ అధికారులు పూర్తిగా సహకరించారని నిన్నటి నుంచి మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించేందుకు కౌంటర్ టెర్రరిజం వింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత హోం శాఖ అధికారుల టీం పాకిస్థాన్‌కు వెళ్లింది.

 

వరుసగా 2006, 2007ల్లో పాక్‌లో పర్యటించిన ఈ బృందం మరోసారి 2008 నవంబర్‌ 24న ఆ దేశానికి వెళ్లింది. 25న చర్చలు జరగాల్సి ఉంది. కానీ పాక్ అధికారులు కావాలని ఆలస్యం చేసి..చర్చల తేదీని 26కు మార్చారు. 26న కసబ్ తదితరులతో కూడిన ఉగ్రవాదుల పడవ దేశ పశ్చిమ తీరం గుండా ముంబైలోకి ప్రవేశించి పని మొదలెట్టింది. దాడి విషయం తెలిసిన వెంటనే ఈ బృంద సభ్యులతో మాట్లాడేందుకు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నించారు. అయితే పాక్ అధికారులు చాలా తెలివిగా..మొబైల్ నెట్‌వర్క్ రాని ముర్రీ అనే ప్రాంతంలో వారిని ఉంచారు. ముంబైలో బలగాలను మోహరించినా వీరిని నడిపించే అధికారులు మాత్రం పాక్ వలలో చిక్కుకుపోయాయరని అప్పటి హోంశాఖ మాజీ అధికారి మణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.