ముంబై పేలుళ్ళు: ముగ్గురికి మరణ శిక్ష
Published on: Sat Feb 11, 2012 9:08AM
ముం
బయి: ముంబయి నగరంలో 2003లో బాంబు పేలుళ్లకు పాల్పడిన ముగ్గురు నిందితులకు కిందికోర్టు విధించిన మరణ శిక్షలను బొంబాయి హైకోర్టు శుక్రవారం ధ్రువీకరించింది. ముగ్గురిలో ఒక మహిళ కూడా ఉంది. 2003 ఆగస్టు 25న దక్షిణ ముంబయిలోని ఇండియా గేట్, జవేరి బజార్ ప్రాంతాల్లో రెండు టాక్సీల్లో బాంబులు పెట్టి 52మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అషత్ అన్సారీ, హనీఫ్ సయ్యద్ అనీస్, అతని భార్య ఫెస్మిదా సయ్యద్‌లకు ప్రత్యేక పోటా న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ముగ్గురూ లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టులని, పథకం ప్రకారమే బాంబు పేలుళ్లు జరిపారని ప్రాసిక్యూషన్ వాదించింది. అదే ఏడాది జూలై 26న సెంట్రల్ ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతం సిటీ బస్సులో జరిగిన పేలుడుకూ వీరే కారణమని కోర్టు నిర్ధారించింది. పోటా కోర్టు విధించిన మరణ శిక్షను సవాలు చేస్తూ ముగ్గురూ హైకోర్టుకు వెళ్లారు. కాగా కింది కోర్టు వీరికి మరణశిక్ష విధించడం సరైనదేనని జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ పిడి కోడెలతో కూడిన హైకోర్టు బెంచ్ శుక్రవారం తీర్పు చెప్పింది.


