కొడుకు పనితీరు సరిగా లేదన్న తండ్రి

 

యూపీ మాజీ సీఎం,సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు, పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌గా అఖిలేశ్ యాదవ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని.. తన బాధ్యతలను ఆయన సరిగా నిర్వర్తించడం లేదని ఆయన పేర్కొన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ములాయం... ‘‘అఖిలేవ్ యాదవ్‌పై విస్తృతమైన బాధ్యత ఉంది. అంచనాలకు తగిన విధంగా ఆయన పనిచేయాలి. వచ్చే ఎన్నికల కోసం చేస్తున్న సన్నాహాల్లో ఎస్పీ కంటే బీజేపీ చాలా ముందుంది. మేల్కొనకపోతే ఎస్పీకి ప్రమాదం తప్పదు..’’ అని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పించాలనీ... పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణ పెంపొందించాలని ఆయన సూచించారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ములాయం ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.