ధర్మ పోరాట దీక్షలో విభజన బిల్లు రూపకర్త

 

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు జాతీయ స్థాయిలో నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా దీక్ష స్థలికి చేరుకొని మద్దతు తెలిపారు. తాజాగా జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ వేదిక వద్దకు చేరుకొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా శరద్‌యాదవ్‌ మాట్లాడుతూ...."ఏపీ ప్రజల ధర్మ పోరాట దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రైతులు, నిరుద్యోగులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రి ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తున్నారు. ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలాగే అన్ని పక్షాలు ఏకమయ్యాయి. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే విపక్షాలు ఏకమవుతున్నాయి. కోల్‌కతాలో మమతకు ఇలాంటి సంఘీభావమే తెలిపాం. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఏపీ విభజన హామీలు నెరవేర్చే వరకు అండగా ఉంటాం’’ అని స్పష్టం చేశారు. 
ములాయం సింగ్‌ యాదవ్‌ మాట్లాడుతూ... ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. చంద్రబాబు వెంట తామంతా ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ ఆయన వెంటన నడుస్తోందన్నారు. చంద్రబాబు వెంట రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని చెప్పారు. వారు న్యాయం కోసం పోరాడతారని, అవసరమైతే తిరగబడతారని హెచ్చరించారు. ఈ దీక్షలో ఓ ఆసక్తికర సంఘటన సైతం చోటు చేసుకుంది. అందరిలాగే కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా హజరయ్యారు. సభా వేదికపై ప్రసంగించిన అనంతరం ఆయన వద్దనున్న మైకును చంద్రబాబు అందుకున్నారు. విభజన బిల్లు రూపకల్పన చేసింది జైరాం రమేష్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో జైరాం రమేష్ తల బాదుకున్నారు. తన భార్య చనిపోయిన బాధలో ఉన్నా.. ఏపీకి మద్దతు తెలిపేందుకు ఆయన వచ్చారని చంద్రబాబు సభలో తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనెర్జీ కూడా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. దీక్షకి సంఘీభవం తెలిపారు.