ములాయంకి మళ్ళీ అస్వస్థత...ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి

 

యూపీ రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ రెండ్రోజుల క్రితం అనారోగ్యానికి గురయిన సంగతి తెలిసిందే. షుగర్ లెవల్స్ బాగా పెరగడంతో ఆసుపత్రి పాలయిన ములాయం ఆరోగ్య స్థితి కుదుటపడ్డాక డిశ్చార్జ్ అయ్యారు. అయితే అందుతున్న తాజాగా సమాచారం ప్రకారం ఆయన మళ్ళీ అనారోగ్యం పాలు కావడంతో లక్నోలోని తన నివాసం నుండి ఢిల్లీ శివార్లలో ఉన్న ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్ లో తరలించినట్టు సమాచారం. అక్కడి మేదాంత ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. నిజానికి ఆదివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు వైద్యం అందిస్తూనే ఉంది. నిన్న సాయంత్రం మళ్ళీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే నిన్న ఆయనని ఆసుపత్రికి తరలించకముందు యూపీ సీఎం యోగీ స్వయంగా ములాయం ఇంటికే వచ్చి పరామర్శించారు. అయితే మునుపెన్నడూ లేనిది యోగీ ఇలా రావడాన్నికి కారణం ములాయం ఆనారోగ్య పరిస్థితే అని బీజేపీ వర్గాలు చెబుతున్నా విశ్లేషకులు మాత్రం త్వరలో జరగనున్న ఉప ఎన్నికలే అని చెబుతున్నారు. మొన్న లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి దెబ్బ తిన్న ఎస్పీ, బీఎస్పీ మళ్ళీ కలిసి పోటీ చేయమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో యోగీ పలకరింపు మానవతతో కూడుకున్నదా ? లేక రాజకీయంతో కూడుకున్నాదా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.