కుల రిజర్వేషన్లు… మన నేతల జగన్నాటకాలు!

కులం అడ్డుగోడల్ని కూలగొడదాం… ఇలాంటి మాటలు మేధావులు మొదలు మీడియా వాళ్ల దాకా అందరూ మాట్లాడతారు! కానీ, నిజంగా మన దేశంలో కుల నిర్మూలన ఉద్యమం పెద్దగా ఏం జరగటం లేదు. ప్రభుత్వం నుంచీ స్టార్ట్ సినిమాల దాకా అంతటా కులాన్ని పటిష్టం చేసే మాటలు, చర్యలే తప్ప మరొకటి కనిపించవు. అలాంటి కోవలో కుల రిజర్వేషన్లు కూడా వస్తాయి. అసలు కులం ఆధారంగా ఇంకా రిజర్వేషన్లు అవసరమా? అవసరమే అయినా కూడా ఇంకెంత కాలం వరకూ? ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు చర్చకు రావాల్సిన సమయంలో దేశ వ్యాప్తంగా కొత్త కొత్త కులాలు తమకూ రిజర్వేషన్లు కావాలంటూ బరిలోకి దిగుతున్నాయి. రాజకీయ నేతలు కూడా తమ ఓట్ల లావాదేవీల్లో భాగంగా వాట్ని వెన్నుతట్టి ప్రొత్సహిస్తున్నారు. కులం అంటే అధికార పక్షాలు భయపడతాయి. ప్రతిపక్షం గజగజ వణికిపోతుంది. కులంతో పెట్టుకునే మోధుడంటూ ఎవరూ లేకుండాపోయారు!

 

 

కేంద్రంలో వున్న బీజేపీ నిజానికి ఒకప్పుడు కుల రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఆరెస్సెస్ అయితే బాహాటంగానే రిజర్వేషన్లపై రివ్యూ జరగాలనేది. కానీ, పూర్తి మెజార్టీతో తొలిసారి మోదీ ప్రభుత్వం గద్దెనెక్కాక ఒక్కసారిగా స్వరం మారిపోయింది! స్వయంగా ప్రధానే తన తాజా ఇంటర్వ్యూలో… కుల రిజర్వేషన్లు ఇంకా చాలా కాలం భద్రంగా వుండబోతున్నాయని తేల్చి చెప్పారు! మరోవైపు బీజేపీకే చెందిన నితిన్ గడ్కరీ మరాఠా ప్రజల రిజర్వేషన్ ఉద్యమంపై స్పందిస్తూ … అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కుడున్నాయని ఎదురు ప్రశ్నవేశారు! అంటే… రిజర్వేషన్ల గోలంతా ఓట్ల మాయాజాలమే తప్ప నిజంగా రిజర్వేషన్లు వున్న వాడికీ, లేని వాడికి, ఎవరికీ అవతల ఉద్యోగాలు లేవన్నమాట! ఇంత మాత్రం దానికి జనాన్ని పొలిటీషన్స్ జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం దేనికి?

 

 

జాతీయ స్థాయి నుంచీ రాష్ట్ర స్థాయికొస్తే… ఏపీలో కాపు రిజర్వేషన్ల వివాదం కాక రేపుతోంది. అసలు కాపులకి బీసీ స్టేటస్ ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఎలా ఇవ్వాలి? ఇవ్వకపోతే కాపు సోదరుల డిమాండ్లు మరో మార్గంలో ఎలా పరిష్కరించాలి? ఇవీ చర్చించాల్సిన ప్రశ్నలు! కానీ, వాటికి బదులు రాజకీయ డ్రామా నడుస్తోంది. చంద్రబాబు ఒకవైపు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేయించేశారు. బంతి కేంద్రం కోర్టులోకి తోశారు. కాపులకి రిజర్వేషన్లు ఇప్పుడు మోదీ సర్కార్ చేతిలో వున్నాయి! మరి దిల్లీ ప్రభుత్వం అంగీకరిస్తుందా? వాళ్లు సుప్రీమ్ రూల్స్ అంటూ నెపాన్ని అత్యున్నత న్యాయస్థానంపై నెట్టేస్తారు! అలా కాపుల రిజర్వేషన్ కోరికని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారు!

 

 

కేంద్ర , రాష్ట్ర అధికార పక్షాలు కాపుల రిజర్వేషన్లపై తాత్సారం చేస్తుండటంతో జగన్, పవన్ లాంటి నేతలు కాపుల వివాదంతో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అందులోనూ క్లారిటీ లేదు. రోజుకో మాట మాట్లాడుతుంటారు. కులాల గురించి పెద్దగా మాట్లాడని జనసేనానికి అదేదో 9వ షెడ్యూల్ అనే మాట వాడి ఒక కామెంట్ చేసేశారు. ఆ మార్గంలో ఎప్పటికి కాపులకు రిజర్వేషన్లు లభిస్తాయి? దేవుడికే తెలియాలి! ఇక జగన్ దైతే మరీ పెద్ద డైలామా! ఆయన ఓ రోజు నా చేతుల్లో ఏం లేదు అంటారు. అంతా కేంద్రం చేయాల్సిందే అంటూ కుండ బద్ధలు కొడతారు. తెల్లారే సరికి కాపు ఓట్లు మొత్తానికి మొత్తంగా తుడిచి పెట్టుకుపోతాయని గ్రహించి యూటర్న్ తీసుకుంటారు. కాపులకు బీసీ హోదా విషయంలో నేను రెడీనే… కాకపోతే చంద్రబాబు కంటే రెట్టింపు నిధులు కాపు కార్పొరేషన్ కు కేటాయిస్తా అంటూ చెబుతారు!

 

 

జగన్ రోజుకో మాట మాట్లాడుతుండటంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా ఆయనకు రివర్స్ అయ్యారు. జగన్ తమకు పదివేల కోట్లు ఇవ్వటం కాదు మేమే ఇరవై వేల కోట్లు ఆయనకు ఇస్తాం. సీఎంగా కాపు కులస్థుడ్ని కూర్చోబెట్టండని సవాల్ విసిరారు! మొత్తంగా ఈ వివాదం జగన్ సెల్ఫ్ గోల్స్ లో అతి పెద్దదిగా మారింది. ఆయన చేసిన ఒక్క వ్యాఖ్య ఇప్పుడు కాపు ఓటర్లని, కాపు నాయకుల్ని ఇద్దర్నీ జగన్ కు దూరం చేస్తోంది. అదే సమయంలో తమ కులానికే చెందిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ నేతగా అవతరించనున్నాడు కాబట్టి కాపులు ఆయన వైపు వెళ్లే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. వాళ్లు జనసేన వైపు వెళ్లినా, టీడీపీ వైపు మళ్లినా… నష్టం మాత్రం కాబోయే సీఎంని అనుకుంటున్న జగన్ కే!

కాపు రిజర్వేషన్ల విషయంలో నోరు జారిన జగన్ ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తే… మన దేశ తలపండిన పొలిటీషన్ప్ ఎవ్వరూ , ఎందుకు రిజర్వేషన్ల కొరివితో తలగొక్కోరో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ, కుల ఉద్యమాలు, కుల రిజర్వేషన్ల విషయంలో తేరుకోవాల్సింది జనమే! ఎందుకంటే అన్ని పోరాటాల తరువాత లాభపడేది ఏదో ఒక రాజకీయ పక్షమే తప్ప నిజమైన నిరుపేద జనం కాదు! ఎందుకంటే, రిజర్వేషన్ ఆధారంగా ఇవ్వబోయే ఉద్యోగాలు అంటూ ప్రస్తుత ప్రైవేటీకరణ ప్రపంచంలో పెద్దగా లేవనే చెప్పాలి!