ముద్రగడ ఉద్యమాన్ని హైజాక్ చేశారా?
Published on: Mon Feb 1, 2016 4:04PM

తమ వర్గంవారికి రిజర్వేషన్లు కల్పించమంటూ తనిలో ఒక భారీ సభ జరుగుతోంది. ఆ వేదిక మీద ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వారందరూ ఎన్నో విషయాలు మాట్లాడేందుకు, మనసులోని మాట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ముద్రగడ పద్మనాభంగారు కాపుగర్జనలో తన వంతు రాగానే హఠాత్తుగా ఉద్యమం తీరుని మార్చేశారు. `నేను మీ కోసమే ఉంటాను. నా కుటుంబం మీ కోసమే పని చేస్తుంది. మీరంతా నా వెంట ఉంటారా?’ అంటూ జనాలని రైలు పట్టాల వైపుకి బయల్దేరదీశారు. `ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకునేదాకా రైలు పట్టాల మీద నుంచి కదిలేది లేదని` పిలుపునిచ్చారు. తమ కులం వారికి అన్యాయం జరుగుతోందంటూ వాపోతున్న ముద్రగడ, తన తోటి నాయకులకు అవకాశం కూడా ఇవ్వకుండా జనాల దృష్టిని పూర్తిగా తనవైపుకి ఎందుకు మరల్చుకున్నట్లు! ఉద్యమాన్ని ఏకపక్షంగా ఎందుకు నడిపించినట్లు! ఇదంతా ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు చేశారా లేకపోతే పోరాటానికి తాను ఒక్కడినే నాయకుడిగా మిగిలిపోదామనుకున్నారా!


