చంద్రబాబుపై పోరుకు.. ఒకే తాటిపైకి అందరూ..

 

కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గతంలో ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. అయితే అది కాస్త హింసాత్మకంగా మారినా.. ప్రభుత్వం ఎలాగో కల్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. దాంతో ముద్రగడ కూడా దీక్ష విరమించారు. అయితే ఆ తరువాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ముద్రగడ మళ్లీ దీక్ష చేశారు. దాదాపు పది రోజుల పైనే ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేశారు. దీంతో మళ్లీ ప్రభుత్వం కదిలి వచ్చి ఆయన డిమాండ్లు నెరవేరుస్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఖచ్చితంగా కాపులకు న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అంతేకాదు దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి గడువు కూడా ఇచ్చారు. దీంతో ముద్రగడ మళ్లీ దీక్ష విరమించారు. ఆ తరువాత కూడా పరిస్థితి యథావిథిగానే మారింది. ఈ నేపథ్యంలో ముద్రగడ మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన కమిషన్ గడువు ఇంకో పదిరోజుల్లో ముగియనుండటంతో.. కమిషన్ నివేదిక ఇవ్వకున్నా, దాని ప్రకారం ప్రభుత్వంలో కదలిక లేకున్నా ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు.

 

ఈ చర్చలకు ఇప్పటికే ముద్రగడకు మద్దతుగా నిలిచిన దాసరి నారాయణరావు, కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో ఈరోజు ఆయన హైదరాబాద్లో భేటీ అయ్యారు. అంతేకాదు వైసీపీ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సెప్టెంబర్ 11వ తేదీన కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. మొత్తానికి చంద్రబాబుపై పోరాడటానికి పార్టీల కతీతంగా అందరూ ఒకతాటిపైకి వచ్చారు. మరి చంద్రబాబు వీరందరినీ ఎలా ఎదుర్కొంటారో చూద్దాం..