TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముద్రగడ కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం

Published on: Mon Dec 27, 2021 2:31PM

కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. చాన్నాళ్లు కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉరకలు పెట్టించిన ఆయన కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంటికి, సొంత పనులకే పరిమితమయ్యారు. అయితే.. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ముద్రగడ పద్మనాభంతో శెట్టిబలిజలు, మాల మహానాడు నేతలు, అమలాపురం పట్టణ వైసీపీ అధ్యక్షుడు సమావేశమయ్యారు. దీంతో ముద్రగడ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. అది కూడా సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తెర మీదకు తెచ్చేందుకు ముద్రగడ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా సేవలు అందించిన ఆయనపై ఏనాడూ ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు ఇవ్వలేదు. ముద్రగడ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారనగానే కొన్ని పార్టీలు ఆయనను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ పార్టీల ఆటలను ముద్రగడ సాగనివ్వడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. శెట్టిబలిజ, మాలమహానాడు నేతలతో కలిసి సరికొత్త ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పాటు చేయాలనే వ్యూహంలో ముద్రగడ ఉన్నారని, అందులో భాగంగానే ఆయా సామాజికవర్గాలు, మతాల నేతలలో సమాలోచనలు జరిపారనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఒకానొక సమయంలో ముద్రగడ జనసేన వైపు కొద్దిగా మొగ్గు చూపారని.. కానీ.. రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఆ పార్టీ లేకపోవడంతో విరమించుకున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా.

ఈ క్రమంలో కొత్త ప్రత్యామ్యాయంతో ముందుకు రానున్న  ముద్రగడతో కలిసి నడిచేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని, వారిలో మాజీ డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారని సమాచారం. వారితో పాటుగా ప్రస్తుత రాజకీయ పార్టీల్లోని పలువురు ఉన్నత స్థాయి నేతలు కూడా ముద్రగడ పద్మనాభం ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుత రాజకీయ పార్టీలు ఏదో ఒక కులానికో, మతానికో, వర్గానికో సానుకూలంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రత్యామ్నాయం ఏదో ఒక కులమో, మతమో, వర్గం ముద్రతో కాకుండా అందరి మద్దతుతో ముందుకు వస్తుందని తెలుస్తోంది. ముద్రగడ నివాసంలో శెట్టిబలిజలు, మాలమహానాడు నేతలతో జరిగిన అంతర్గత సమావేశం ఇదే విషయం స్పష్టం చేస్తోంది.