TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముద్రగడ నివాసంలో అర్ధరాత్రి చర్చలు!

Published on: Mon Feb 8, 2016 9:01AM

కాపులకు రిజర్వేషన్లను కల్పించాలంటూ ముద్రగడ చేపట్టిన దీక్ష నేడు నాలుగో రోజుకి చేరుకుంది. మూడో రోజైన ఆదివారం ముద్రగడ తలుపులు వేసుకుని మరీ దీక్షని సాగించడంతో... జిల్లాలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ప్రభుత్వం తరఫున కొందరు ప్రతినిధులు అర్ధరాత్రినాటికి ముద్రగడ ఇంటిని చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముద్రగడ చేసిన డిమాండ్లకు ఇవాళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయ. కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మంజునాధ కమీషన్ తన నివేదికను కేవలం మూడు నెలలలోనే ఇవ్వాలన్నది ముద్రగడ ప్రధాన డిమాండుగా కనిపిస్తోంది. ఇక కాపుల సంక్షేమం కోసం రెండు వేల కోట్లని కేటాయించాలన్నది ఆయన రెండో డిమాండుగా తెలుస్తోంది. తుని సంఘటనలో నమోదైన కేసుల గురించి కూడా ముద్రగడ చర్చించినట్లుగా కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, బోండా ఉమామహేశ్వరావు ఈ చర్చలను నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి తమ ప్రతినిధుల రాయబారానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!